Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలతో కమ్యూనిస్టులు
- ఎర్రజెండానే దేశానికి ప్రత్యామ్నాయం
- విచ్ఛిన్నకర సిద్ధాంతంతో వస్తున్న బీజేపీని తిప్పికొట్టాలి
- గ్రామీణ స్థాయిలో పోరాటాలను ఉధృతం చేయాలి
- ప్రత్యామ్నాయ విధానాలతోనే కేరళలో అభివృద్ధి : విజయరాఘవన్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి/ఖమ్మం ప్రాంతీయప్రతినిధి
'దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతూ వారి ద్వారా బీజేపీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నది. మరోవైపు ప్రజల మధ్య చిచ్చుపెట్టి విచ్ఛిన్నకర సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నది. బీజేపీ రాజకీయమంతా డబ్బు, కార్పొరేట్లు, మతం చుట్టే తిప్పుతున్నది. కమ్యూనిస్టులు నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతున్నారు. ఈ దేశానికి ఎర్రజెండానే ప్రత్యామ్నాయం. కేరళలోని కమ్యూనిస్టుల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలతో అభివృద్ధి చేసి చూపెడుతున్నది' అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎ.విజయరాఘవన్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ చివరకు విపక్షాలు కూడా లేకుండా చేయాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. క్షేత్రస్థాయిలో పోరాటాలను ఉధృతం చేయాలనీ, ప్రజాస్వామ్య పురోగామి శక్తులను మనవైపు తిప్పుకోవాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలోని వేదగిరి శ్రీనివాసరావునగర్(భక్తరామదాసు కళాక్షేత్రం)లోని అమరవీరుల ప్రాంగణంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు పి.సోమయ్య అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాయకులు అమవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. సంతాప తీర్మానాన్ని వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ ప్రవేశపెట్టారు. మహాసభ రెండు నిమిషాల మౌనం పాటించి అమరవీరును స్మరించుకున్నది. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షత వహించిన మహాసభనుద్దేశించి విజయరాఘవన్ మాట్లాడుతూ..వీరతెలంగాణ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ నిరంకుశ రాజకీయాలు చేస్తూ పార్లమెంట్, అసెంబ్లీలను ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. సామాన్య ప్రజానీకం గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదనీ, కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదని విమర్శించారు. మూజవాణి ఓటుతో తమకు, కార్పొరేట్లకు అనుకూల చట్టాలను బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదనీ, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతును నొక్కేస్తున్నదని చెప్పారు. విపక్షాలు లేకుండా చేయాలనీ, ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలాలని యత్నిస్తున్నదని విమర్శించారు. మనిషి అని అనే భావన కూడా లేకుండా, కులం, మతం పేరుతో చూడటం దారుణమన్నారు. దేశంలో వెనుకబడిన వర్గాలు బతికే పరిస్థితి కూడా లేదన్నారు. లౌకిక విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. వామపక్ష పాలనలో ఉంది కాబట్టే కేరళ అభివృద్ధిలో, మానవాభివృద్ధి సూచిలో నెంబర్‌వన్‌గా ఉందని చెప్పారు. కాబట్టే భూసంస్కరణలు, భూ పున:పంపిణీ సాధ్యమైందని తెలిపారు. కేరళ రూపంలో దేశానికి ప్రత్యామ్నాయ పాలన ఉందన్నారు. 75 ఏండ్ల ఆజాదికా అమృత్ మహౌత్సవాలు జరుపుతున్న తరుణంలోనూ ఆకలి దేశంగా ఉండటం శోచనీయమన్నారు. ఈ విషయంలో ప్రపంచంలో మన దేశం 121వ స్థానంలో ఉండటం దారుణమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్టీ, ఎస్సీ మహిళలపై ఆకృత్యాలు అధికమయ్యాయని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ పేదల నుంచి భూములు గుంజుకునే చర్యలు అధికం అయ్యాయని చెప్పారు. ఖమ్మం చుట్టుపక్కల జరిగిన కూలీ పోరాటాలు చెప్పుకోదగ్గవనీ, ముదిగొండలో ఏడుగురు భూ పోరాటంలో ప్రాణ త్యాగం చేసి విషయాన్ని స్మరించుకున్నారు. భూపోరాటాల్లో సంఘం చొరవ మంచి ఫలితాలను రాబట్టిందన్నారు. ఏపీ, తెలంగాణలో ఉపాది హామీ చట్టాన్ని అమలు చేయించడంలో వ్యవసాయ కార్మిక సంఘం పాత్ర కీలకమైనదన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. పేదలకు ఉపయోగకరమైన ఆ చట్టాన్ని కొనసాగించేందుకు పోరాటం చేస్తామన్నారు. పేదలకు ఇండ్లు ఇస్తున్నట్టు నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటనల పేరుతో గొప్పలకు పోతున్నదనీ, వాస్తవానికి ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం 3.5 లక్షల ఇండ్లు కట్టించి పేదలకు పంచామని చెప్పారు.
డాక్టరైనా..యాక్టరైనా కష్టజీవుల పక్షానే..
ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్
డాక్టరయినా, యాక్టరయినా కష్టజీవుల పక్షాన నిలబడాల్సిందేనని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్ అన్నారు. రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టుల పని అయిపోయిందనే వారికి కమ్యూనిస్టులతోనే ప్రజలకు పని ఉందనే ఆవశ్యకతను నిన్నటి బహిరంగసభ చాటిందని చెప్పారు. ఆ సభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కౌలురైతు, రైతుబంధు, రుణ సౌకర్యం, విద్యా, వైద్యం లాంటి కనీస సౌకర్యాల కోసం ఫలవంతమైన చర్చలు మహాసభల్లో జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ కార్మికులందర్నీ ఐక్యం చేసి కుల, మత ప్రాంతీయ ధోరణిలతో పనిచేసే విచ్ఛిన్నకర శక్తులను దూరం చేస్తూ ధృడమైన ప్రణాళిక రూపొందించాలని ఆకాంక్షించారు.
దున్నే భూములను లాగి కార్పొరేట్లకు ధారాదత్తం : పి.సోమయ్య
దున్నేవాడికే భూమి అని వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపకులు పుచ్చలపల్లి సుందరయ్య పోరాడితే..నేటి పాలకులు మాత్రం కార్పొరేటు శక్తులకే భూమి అన్నట్టు చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు పి.సోమయ్య అన్నారు. నిజమైన అన్నదాత అంటే వ్యవసాయ కార్మికుడేనని తెలిపారు. వ్యవసాయ కార్మికులకు ఓ చట్టం ఉండాలని సీపీఐ(ఎం) నేత, మాజీ ఎంపీ హరికిషన్ సూర్జిత్ పార్లమెంట్లో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. రెవెన్యూ, మార్కెటింగ్, ఎక్సైజ్, పన్నుల తదితర రూపాల్లో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో అత్యధికంగా వ్యవసాయ కార్మికుల ద్వారానే లభిస్తున్నదని చెప్పారు. వాటిలో 10 శాతం వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. సమాజానికి అట్టడుగున ఉంటూ అన్యాయానికి గురవుతున్నది వ్యవసాయ కార్మికులేనని చెప్పారు. 1934లోనే సుందరయ్య వారి కోసం ప్రత్యేక సంఘాన్ని స్థాపించారన్నారు. మహాసభలో యాదాద్రి భువనగిరి నాయకులు రొడ్డ అంజయ్య, వేముల మహేందర్ జ్ఞాపకార్ధం ఆ జిల్లా నుంచి జ్యోతిని తీసుకొచ్చి విజయరాఘవన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఉపాధ్యక్షులు విక్రమ్, కేరళ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, ప్రధానకార్యదర్శి తీగల సాగర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, స్కైలాబ్‌బాబు, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్‌నాయక్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేశ్, వ్యకాస జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ, పొన్నం వెంకటేశ్వర్లు, వేదగిరి శ్రీనివాసరావు సతీమణి కళావతి, వేముల మహేందర్ సతీమణి, రొడ్డ అంజయ్య కుమారుడు పాల్గొన్నారు. పీఎన్ఎమ్ కళాకారులు తమ ఆటపాటలతో సభను ఉత్తేజపర్చారు.