Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహణ
- గతం కన్నా ఎక్కువ స్టాళ్లు
- మార్కెట్ కన్నా తక్కువ ధరలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతీయేటా నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)కు ఇప్పుడు కూడా రంగం సిద్ధమైంది. జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు ఇది కొనసాగనున్నది. ఈ మేరకు శుక్రవారం నాంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి వి.సాయినాథ్ దయాకర్ శాస్త్రి, ప్రచార సబ్ కమిటీ కన్వీనర్ ధీరజ్ కుమార్ జైస్వాల్, సలహాదారు పి.హరినాథ్‌రెడ్డి, సొసైటీ కోశాధికారి పాపయ్య చక్రవర్తి తదితరులు వివరాలను వెల్లడించారు. గతేడాది కన్నా ఈసారి ఎక్కువ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్టు వారు తెలిపారు. ఇప్పటికే 2,350 స్టాళ్ల ఏర్పాటు కాగా, మరి కొన్నింటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతీ వస్తువునూ మార్కెట్లో లభించే ధర కన్నా తక్కువ ధరకే అమ్మేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జనవరి ఒకటిన ప్రారంభోత్సవ సభకు సొసైటీ అధ్యక్షులు, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధ్యక్షత వహిస్తారని చెప్పారు. హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా హాజరవుతారని తెలిపారు. ఈ ప్రదర్శనలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన స్టాళ్లు ఉంటాయని వారు చెప్పారు. మన రాష్ట్రానికి చెందిన వివిధ శాఖలు సైతం స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయని వివరించారు. గతానుభవాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా అంబులెన్సులను అందుబాటులో ఉంచటంతోపాటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అన్ని చర్యలనూ తీసుకున్నట్టు చెప్పారు. గతంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి బాధితులందరికీ నష్ట పరిహారం చెల్లించినట్టు స్పష్టం చేశారు. పార్కింగ్ వద్ద ప్రయివేటు వ్యక్తుల జోక్యం, దోపిడీని అరికట్టేందుకు వీలుగా ఎక్కడికక్కడ తమ స్వచ్ఛంద కార్యకర్తలను డ్రెస్ కోడ్‌తో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. మహిళా సాధికారతను తెలిపే డ్వాక్రా, మెప్మా వంటి సంఘాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని వారు వెల్లడించారు. సూక్ష్మ, మధ్య, తరహా పరిశ్రమలను తగిన రీతిలో ప్రోత్సహిస్తు న్నామని అన్నారు. ఈ ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయంతో 19 విద్యా సంస్థల ద్వారా 30 వేల మంది విద్యార్థులకు విద్యను, 10 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తున్నట్టు ఈ సందర్భంగా నిర్వాహకులు వివరించారు. మరోవైపు దక్షిణ భారతదేశ శాఖాహార భోజనాలతోపాటు ఈసారి హలీం, కబాబ్స్, పిజ్జాలు కూడా ఎగ్జిబిషన్ సొసైటీ భోజనశాలలోకి వచ్చి చేరాయి. భద్రత కోసం సీసీటీవీ కెమెరాలతోపాటు ఇతర అన్ని చర్యలూ తీసుకున్నారు.