Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బియ్యం సేకరణ.. నేటితో ముగియనున్న ఎఫ్‌సీఐ గడువు
- ప్రతియేటా లక్ష్యానికి దూరంగా సీఎంఆర్
- బియ్యం అప్పగింతలో మిల్లర్ల మాయాజాలం
- నిబంధనల ప్రకారం 45రోజుల్లోనే.. బియ్యం అందించాలి
- గతేడాది వానాకాలం పంటనే పూర్తిగా చేయని మిల్లింగ్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వం అందించిన ధాన్యాన్ని మరపట్టి ఎఫ్‌సీఐకి అందించడంలో రైస్‌మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. అందులోనూ ఏయేటికాయేడు సీజన్లవారీగా పెండింగ్ పెడుతూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. 2021-22 వానాకాలంలో సేకరించిన ధాన్యంలో ఇప్పటివరకు 70శాతం బియ్యాన్నే అందించారు. ఈ సీజన్ బియ్యాన్ని అందించేందుకు నవంబర్ చివరి తేదీ వరకు గడువు విధించిన ఎఫ్‌సీఐ రాష్ట్ర సర్కారు లేఖతో మరో నెల రోజులు పొడిగించింది. అది నేటితోనే ముగియనుంది. అయినప్పటికీ మరో 30శాతం బియ్యాన్ని ఇంకా లెక్కలోకి తీసుకురాలేదు. ఇదిలా ఉండగా.. గత యాసంగిలో సేకరించిన ధాన్యంలో ఇప్పటివరకు సుమారు 35శాతం బియ్యాన్నే ప్రభుత్వానికి అందించినట్టు లెక్కలు చెబుతున్నాయి. అధికారులు తరచూ సమీక్షలు పెడుతున్నా మిల్లర్లను హెచ్చరిస్తున్నా.. తీరు ఏమాత్రమూ మారకపోవడం గమనార్హం. ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యం మాత్రం ఇవ్వకుండా అక్రమంగా రవాణా మాత్రం సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని మరపట్టి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం మిల్లులకు కేటాయిస్తుంది. ఈ ప్రక్రియను కస్టమ్ రైస్‌మిల్లింగ్ (సీఎంఆర్)గా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లర్లు బియ్యంగా మార్చి పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. నిబంధనల ప్రకారం కేటాయించిన 45రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అయితే, ప్రభుత్వానికి బియ్యం అప్పగించడంలో మిల్లర్లు తీవ్ర జాప్యమే చేస్తున్నారు. అదీ ఏడాది దాటి రెండు మూడు సీజన్లు దాటినా బియ్య అందించడం లేదు. ఇప్పుడు కూడా గతేడాది వానాకాలం ధాన్యానికి సంబంధించి ఇచ్చింది కేవలం 70శాతం బియ్యమే కావడం గమనార్హం. 2021-22లో కరీంనగర్ జిల్లాలో 3లక్షల 90వేల 252 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని సేకరించగా.. ఇతర జిల్లాల నుంచి మరో 5వేల 610 మెట్రిక్‌టన్నుల ధాన్యం జిల్లా మిల్లులకు కేటాయించారు. ఇందులో నుంచి 2లక్షల 65వేల 227 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు ధాన్యం మర ఆడించి ఇచ్చింది లక్షా 83వేల 83 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే. ఇంకా 82వేల 144 మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆప్ ఇండియాకి అప్పగించాల్సి ఉంది.
నేటితో ముగియనున్న గడువు
గత వానాకాలం సీజన్‌కు సంబంధించిన బియ్యం ఇవ్వాల్సిన గడువు నవంబర్ 30కే ముగిసింది. అయితే, రాష్ట్ర సర్కారు పలు కారణాలతో కూడిన లేఖను ఎఫ్‌సీఐకి రాయడంతో కొంత సానుకూలంగా స్పందించి డిసెంబర్ 31వరకు గడువు పొడిగించింది. అయినప్పటికీ ఇంకా మిగిలిన ధాన్యానికి సంబంధించి బియ్యాన్ని మిల్లర్లు అందించలేదు. ఇది ప్రతియేటా సాగుతున్న తంతుగానే కనిపిస్తోంది. ఇదే క్రమంలో కొందరు మిల్లర్లు బియ్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుపడటం, అధికారులు తనిఖీలు చేపట్టినప్పుడు ప్రభుత్వ కేటాయింపుల్లో మిల్లుల్లో నిల్వకు పొంతన లేకపోవడం ఎదరవుతున్నాయి. ఇది సీఎంఆర్‌పై అనుమానాలను రేకిస్తున్నాయి.
గడువులోపు సీఎంఆర్ అందించాలి
మిల్లర్లకు అడిషనల్ కలెక్టర్ ఆదేశాలు జారీ
2021-22 సీఎంఆర్ చెల్లింపులపై జిల్లాల్లోని రైస్‌మిల్లర్లు సంబంధిత అధికారులతో అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బాకీ ఉన్న రైస్‌మిల్లర్లు అందరూ త్వరితగతిన సీఎంఆర్ రైస్‌ను సీఎస్సీకి నేటిలోగా అందించాలి. సమావేశంలో కరీంనగర్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.