Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్లో 14,017 మెగావాట్లకు చేరిక
- యాసంగిలో 15,500 మెగావాట్లకు చేరుతుందని అంచనా
- సాగువిస్తీర్ణం పెరగడమే కారణం: టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ డీ ప్రభాకరరావు
- ఆటోమేటిక్ స్టార్టర్లు ఆఫ్ చేయండి : టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. డిసెంబర్ నెలలో ఈ స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరగడం ఇదే తొలిసారి. గత ఏడాది డిసెంబర్లో విద్యుత్ డిమాండ్ 10,935 మెగావాట్లు కాగా, ఇప్పుడు 14,017 మెగావాట్లకు పెరిగింది. రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ వినియోగం 2021లో 14,160 మెగావాట్లు కాగా, ఈ ఏడాది మార్చిలో ఈ డిమాండ్ 15,500 మెగవాట్లకు చేరుతుందని విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. అయితే ఆ మేరకు విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేసినట్టు విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ డిమాండ్ 6,666 మెగావాట్లు కాగా, ఇప్పుడు వందశాతం కంటే ఎక్కువగా పెరిగింది. విద్యుత్ సరఫరా వ్యవస్థను 2014తో పోల్చిచూసినప్పుడు, అప్పట్లో 220 కేవీ సబ్స్టేషన్లు 51 ఉండగా, ఇప్పుడు వాటిసంఖ్య 99కి పెరిగింది. అలాగే 32 కేవీ సబ్స్టేషన్లు అప్పట్లో 175 ఉండగా, ఇప్పుడు 307కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లు 1 కోటి 71 లక్షల 307 ఉన్నాయి. వీటిలో 55 లక్షలకు పైగా నూతన కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థల్లో సాంకేతికతకు పెద్ద పీట వేయడంతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాదిలో విద్యుత్ డిమాండ్ 3,450 మెగావాట్లు ఉండగా, ఈ ఏడాది 4వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉన్నట్టు టీఎస్ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు అంచనా వేశారు. విద్యుత్ డిమాండ్ పెరగడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆయా సంస్థల ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు.
సాగు విస్తీర్ణం పెరిగినందువల్లే...
టీఎస్‌ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు
రాష్ట్రం ఏర్పడినప్పటికీ, ఇప్పటికీ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. ప్రభుత్వం ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని అదేశించింది. ఆ మేరకు మా పంపిణీ వ్యవస్థల్ని పటిష్టం చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం, వర్షాలు సకాలంలో కురవడం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలకు చెరువుల్లో పూడికలు తీసినందువల్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఫలితంగా వ్యవసాయం రికార్డు స్థాయిలో పెరిగింది. దానికి తోడు అనేక పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి రావడం కూడా ఓ కారణం. ఈ ఏడాదికి విద్యుత్ డిమాండ్ 15,500 మెగవాట్లకు చేరినా విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఆటోమేటిక్ స్టార్టర్లు తీసేయండి...
టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి
రైతులు తమ మోటార్లకు బిగించిన ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించాలి. దానివల్ల వ్యవసాయంలో అవసరానికి మించి నీటి వినియోగం జరుగుతున్నది. ఫలితంగా విద్యుత్ వినియోగం దుర్వినియోగం అవుతున్నది. విద్యుత్ పంపిణీ సంస్థల్లో పూర్తిస్థాయిలో సాంకేతికతను అప్‌గ్రేడ్ చేశాం. వినియోగదారులు కరెంటు ఆఫీసులకు రాకుండానే, తమ సమస్యల్ని పరిష్కరించుకొనేలా చర్యలు చేపట్టాం. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహిస్తున్నాం. ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ మెషిన్లతో బిల్లులు ఇస్తున్నాం. కరెంటు సరఫరాలో ఎలాంటి అవాంతరం ఏర్పడినా, తక్షణం తెలుకొనేలా సాంకేతికతను అప్‌గ్రేడ్ చేశాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి నుంచి ఇప్పటి వరకు విద్యుత్ పంపిణీ సంస్థలకు 38 అవార్డులు వచ్చాయి.