Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొలాహలంగా ఎన్టీఆర్ స్టేడియం
- లక్షలాధిగా ఔత్సాహికుల రాక
- మేధావులు, విద్యార్థులు, మహిళల భారీ స్పందన
అది ఎన్టీఆర్ స్టేడియం.. సాయంత్రం ఐదు గంటల సమయం. హైదరాబాద్ బుక్‌ఫెయిర్ జరుగుతున్న ప్రాంతం.. కొలాహలంగా కనిపిస్తున్నది. చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు అన్ని వయస్సులవారూ కనిపిస్తున్నారు.. ముఖ్యంగా యువత.. అందులోనూ మహిళలు.. క్యూలైన్లో నుంచుని టికెట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నా.. మస్తిష్కంలో ఆలోచనలు 'పుస్తకం' గురించే.
లోపలకెళ్లి చూద్దునుకదా గుంపులుగా గుంపులుగా బుక్స్టాళ్ల ముందు పుస్తక ప్రియులు.. కొందరు పుటలు తిరగేస్తుంటే.. మరికొందరు ఆ పుస్తకం, ఈ పుస్తకం చూపించండి అంటున్నారు.. చర్చించుకుంటున్నారు.. ఇంకొందరు సెల్ఫీలు దిగుతూ సోషల్‌మీడియాలో పెట్టుకునే పనిలో తీరికలేకుండా ఉన్నారు. ఒకవైపు ఈ సందడి ఇలావుండగానే, మరోవైపు ప్రత్యేంగా అలంకరించిన వేదికపై పుస్తకావిష్కరణలతో హడివిడిగా ఉన్నారు నిర్వాహకులు. పుస్తకం అంటే ఏమిటీ? ఎందుకు కొనాలి? ఎందుకు చదవాలి? తదితర సాధారణ ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తుంటాయి. దానికి నాకు 35 ఏండ్ల క్రితం జరిగిన సంఘటన ఇప్పటికీ గుర్తే ఉంది. అదేమంటే..
అదో ఆస్పత్రి.. నెల్లూరు ప్రజావైద్యశాల.. కిటకిటగానే ఉంది. అటూ, ఇటూ తిరుగుతున్నారు రోగులు, డాక్టర్లు.. ముఖాల్లో టెన్షన్ స్పష్టమవుతున్నది. ఒక వ్యక్తి దవఖానాలోనికి అడుగుపెట్టాడు. ఏదో రూమ్‌కోసం వెతుకుతున్నారు. ఆ గదిని కనిపెట్టారు. తట్టి లోపలికెళ్లారు. అక్కడో వ్యక్తి మంచం మీద పడుకున్నారు. ఒకవైపు చేయికి సెలైన్ ఎక్కిస్తున్నారు. మరోవైపు ఆయన ఏదో పుస్తకం చదువుతున్నారు. మంచం మీద వైద్యం చేయించుకుంటున్న వ్యక్తి మార్క్సిస్టు మహామేధావి పుచ్చలపల్లి సుందరయ్య. అయితే, లోపలికి పరామర్శ కోసం వెళ్లిన వ్యక్తి ఆ పార్టీ సీనియర్ కామ్రేడ్. అప్పుడు వారి మధ్య సమకాలీన విషయాలకు సంబంధించి అనేకం చర్చకు వచ్చాయి. 'అనారోగ్యంతో ఉన్నారు.. రెస్ట్ తీసుకోవచ్చు కదా.. పుస్తకాలు ఎందుకు చదవడం.. అలసట వస్తుంది' అని కామ్రేడ్ అంటే.. అప్పుడు సుందరయ్య 'నేను పుస్తకం చదవకుండా, నేర్చుకోకుండా మీకేమీ చెప్పగలను.. పార్టీ యంత్రాంగానికి ఏం జ్ఞానం పంచగలను' అంటూ వ్యాఖ్యానించారట. తర్వాత ఒకానొక సందర్భంగాలో ఆ కామ్రేడ్ చెప్పారు. అదీ పుస్తకం విలువ.
హైదరాబాద్ బుక్ఫెయిర్లో కలియతిరుగుతున్న క్రమంలో ఎంతో మంది కవులు, రచయితలు, మేధావులు, ఉపాధ్యాయులు, స్టాళ్ల యాజమానులు, నిర్వాహకు లతో పలకరిస్తూ ముందుకు సాగుతున్నాను. ఏ షాపులో చూసినా వందల, వేల పుస్తకాలు. అదీ, ఇదీ అని కాదు. ఎన్నో పుస్తకాలు..ఎన్నెన్నో నవలలు. జనరల్ నాలెడ్జీతోపాటు వామపక్ష సాహిత్యం, నిరుద్యోగలకు అవసరమయ్యే పుస్తకాలు, చిన్నారులకు ఆనందాన్నిచ్చే కామిక్స్, మహిళలకు తోడ్పడే గ్రంథాలు మరెన్నో. చివరకూ భక్తిపుస్తకాలూ ఉన్నాయి సుమా. ఒక్కటేమిటీ అన్నీనూ. తెలుగు, ఇంగ్లీషుతోపాటు ఇతర భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి బుక్ఫెయిర్లో ! ఒక్క మాటలో చెప్పాలంటే అదీ పుస్తకాల సముద్రమే. దాదాపు మూడోందలకుపైగా స్టాళ్లతో ఎన్టీఆర్ స్టేడియం విరబూసిందనే చెప్పాలి. అక్కడక్కడా తెలిసిన వాళ్లతో ముందుకు సాగిపోతున్న క్రమంలో కవి యాకూబ్ కనిపించారు. నమస్కరించి నన్ను నేను పరిచయం చేసుకున్నా. అసలు పుస్తకం ఎందుకు కొనాలంటారు అని సరదాగా అడిగాను. అందుకాయన 'ఉన్నచోటు నుంచి మరింత ముందుకు తీసుకెళుతుంది పుస్తకం. నీ మార్గాన్ని అన్వేషిస్తుంది. అదొక మానసీక ఇంధనం. ప్రపంచంలోని ఏమూల ఉన్న విషయాలనైనా మనలోకి ఇంకిస్తుంది.. పరిమితులతో పుస్తకాన్ని చూడలేం.. చూడకూడదు.. దేశాల చరిత్రనే మార్చింది.. ఇంకా మారుస్తూనే ఉంది' అంటూ క్లుప్తంగా ముగించారు. అలా ముందుకు పోతూ ఉంటే అలిశెట్టి ప్రభాకర్ వేదిక మీద ఎవరో మహిళ మాట్లాడుతున్నారు. మైకులో వినిపిస్తుంటే అటుగా వెళ్లాను. అదీ పుస్తకం మీదే. ఏంటంటే ''పుస్తకం అమ్మవంటిది.. చదివితే కమ్మగుంటది, ప్రతిమాట ప్రతి పుట నోటికి కూడౌవుతది.. మొదడుకు పదును పెడతది'' అంటూ కవితను వినిపంచారు. ఎవరా అని ఆరా తీస్తే ఆ మహిళ బేగంపేట మహిళా డిగ్రి కాలేజీ లెక్చరర్ మృదుల అని పరిచయం చేశారు. దగ్గరకు వెళ్లి మీ కవిత బాగుంది మేడమ్ అంటూ ప్రశంసించబోయాను. ఇంతలోనే తను 'అయ్యో నేను రాయలేదండి..అది యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బెల్లి యాదయ్య రాసారు' అంటూ అసలు సంగతి చెప్పుకొచ్చారు. ఇక అక్కడి నుంచి పక్కకు ముఖం పెడితే పాలపిట్ట గుడిపాటి దర్శనమిచ్చారు. ఆయనా ఒకస్టాల్ నడుపుతున్నారు. ఏంటి సార్ బుక్‌ఫెయిర్ ముచ్చట్లు అన్నా అంతే. ఘంటాపథంగా తనకు తెలిసిన విషయాలన్నీ నా ముంగిట కుమ్మరించారు. అవి ఏంటంటారా? ఇవే. బుక్‌ఫెయిర్ ప్రారంభమై దాదాపు వారమైంది. సెలవు రోజుల్లో బాగా వచ్చారు. మిగతా దినాల్లో కొంత తగ్గినా పుస్తకాల పట్ల ప్రేమ మాత్రం తగ్గలే. రీడర్షిప్ ఉంది. కాకపోతే పెంచాల్సిన అవసరమైతే ఉంది. గ్రంథాలయాకు పుస్తకాలను సర్కారే ఇవ్వాలి. అందరికీ ఉపయోగపడతాయి. చిన్నా, పెద్దా అంతా వస్తున్నారు. ఇక్కడ గమ్మత్తేమంటే ముఫ్పయేండ్ల యువత సాంతం ఇంగ్లీషు పుస్తకాలు అడుగుతున్నారంటా. పరిస్థితులు మారాయి కదా.. ఇంటర్నెట్ అవీ, ఇవీ వచ్చాయి. అయినా పుస్తకమే ముఖ్యం' అంటూ ముగించారాయన.
అటు నుంచి అలా నడుచుకుంటూ ముందుకెళితే పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ సంస్థను నడుపుతున్న రమేశ్ కనిపించారు. అయన్నూ కదిలించాను పుస్తకం గురించి. 'మానవ చరిత్రను మనకు చెబుతుంది. గతం,వర్తమానం, భవిష్యత్‌ను తెలియజేస్తుంది.సమస్త విశ్వాన్ని ఒడిసిపట్టి కండ్లముందు చూపెడుతుంది' అంటూ మూడు ముక్కల్లే తేల్చేసేరాయన. అలా ముందుకు కదులుతూంటే మిత్రుడు ఆర్.వాసు కనిపించాడు. ఏంటీ ఇలా వచ్చారు అని పలకరిస్తూనే కుర్చీ చూపించారు. 'సాంకేతిక పెరిగినా పుస్తకం తరగలేదు. మధ్యతరగతిలో ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది..పిల్లలూ ఉత్సాహాం చూపిస్తున్నారు..సోషల్ మీడియాలో సమాచారం వస్తున్నా, పుస్తకంతోనే వాస్తవాలు తెలుస్తాయి' అంటూ అభిప్రాయపడ్డారు. అటు నుంచి ఇంకా సాగిపోతుంటే బుక్‌ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ ఫ్రీ వైఫై సౌకర్యాన్ని లాంఛ్చేసే పనిలో బీజీగా కనిపించారు. అలా అలా స్టాళ్లను చూస్తూ, ప్రముఖులతో మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ప్రముఖ సంఘ సేవకులు కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన 'చిరిగినా చొక్కానైనా తొడుక్కో, కానీ ఒక్క మంచి పుస్తకం కొనుక్కో' అనే మాటలు చెవుల్లో మార్మోగుతున్నాయి. ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం. పుట్టినప్పటి నుంచి మనం పుస్తకాలతో సహవాసం చేస్తూనే ఉంటాం. వాటితోనే పరిగెత్తుతాం. ప్రతి పుస్తకమూ అద్భుతమే. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని ఎంతో మంది పెద్దలు చెప్పే ఉన్నారు. ఇప్పుడు పుస్తకం విలువ ఎంత పెరిగిందంటే.. ఆఘ్గునిస్తాన్లోని తాలిబాన్లు సైతం పుస్తకాలు చేబట్టి బళ్లకు వెళుతున్నారంట. పుస్తకాలు లేని ఇండ్లు దయ్యాల కొంపతో సమానమని తత్వవేత్త సిసిరో సెలవిచ్చిన ముచ్చటా ఎవరికి తెలియనిది.
'అమ్మ జన్మనిస్తుంది...నాన్న ధైర్యాన్నిస్తాడు..అన్నయ్య రక్షణ ఇస్తాడు..స్నేహితులు సంతోషాన్నిస్తారు..ఒక చెట్టు నీడనీ, గాలిని, పండ్లు, పూలను ఇస్తుంది..కానీ, ఒక మంచి పుస్తకం, ఎవ్వరూ ఇవ్వలేని జ్ఞానాన్ని ఇస్తుంది..ఒంటరిగా ఉన్నా ఓటమిని రుచి చూడనీయదు.. బయట ఎలా బతికినా, మనకంటూ ఒక విలువను ఇస్తుంది' అని ఎక్కడో పుస్తకాల్లో చదివిన గుర్తు. ఇక బుక్‌ఫెయిర్ నుంచి వెనక్కి మళ్లాను నా టూవీలర్వైపు అడుగులేస్తూ.
- బి బసవపున్నయ్య