Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలరోజుల పాటు అనాథ బాలలను రక్షించే కార్యక్రమం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్రంలో జనవరి 1 నుంచి నెల పాటు ఆపరేషన్ స్మైల్‌ను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలో అనాథ బాలలతో పాటు ఇండ్ల నుంచి పారిపోయి వచ్చిన పిల్లలు హౌటళ్లు, కార్ఖానాలు, ఇటుక బట్టిలలో పని చేసే బాల కార్మికులను, బిక్షం ఎత్తుకునే పిల్లలను రక్షించి వారిని సొంత తల్లిదండ్రులకు ఈ ఆపరేషన్ ద్వారా చేర్చడం జరుగుతుందని ఆమె తెలిపారు. ముఖ్యంగా, హ్యూమన్ ట్రాఫికింగ్‌లో చిక్కుకున్న బాలికలను కూడా రక్షించి బాలల రక్షణ గృహాలకు చేర్చడం జరుగుతుందని ఆమె వివరించారు. అనాథ పిల్లలను రాష్ట్ర విద్యాశాఖ సహాయంతో వివిధ స్కూళ్లలో చదివించడం జరుగుతుందని ఆమె తెలిపారు. విస్తృత రూపంలో సాగే ఆపరేషన్ స్మైల్‌ను సక్రమంగా సాగించడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ, రాష్ట్ర కార్మిక శాఖ, రాష్ట్ర విద్యాశాఖ లతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన బచ్పన్ బచావో కార్యకర్తలతో కలిసి ఈ ఆపరేషన్ స్మైల్‌ను చేపట్టడం జరుగుతుందని ఆమె వివరించారు. ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించడానికి శుక్రవారం వర్చువల్ సమావేశాన్ని నిర్వహించి చర్చించడం జరిగిందనీ, ఇందులో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, రాష్ట్ర లేబర్ కమిషనర్ గంగాధర్ లతో పాటు పలువురు అధికారులు, స్వచ్ఛంద సంస్థ ల నిర్వాహకులు, యునిసెఫ్ ప్రతినిధులు పాల్గొన్నారని ఆమె తెలిపారు.