Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేేరళ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రన్
ఖమ్మం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నామనికరళ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రన్ చెప్పారు. ఖమ్మంలోని వేదగిరి శ్రీనివాసరావు నగర్ (భక్తరామదాసు కళాక్షేత్రం)లోని అమరవీరుల ప్రాంగణంలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో ఆయన సౌహార్ధ్ర సందేశాన్ని ఇచ్చారు. కేరళలో తమ ప్రభుత్వం 26 లక్షల మందికి భూమి హక్కును కల్పించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి సమస్యనూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషిచేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి వంద మంది వ్యవసాయ కార్మికులకు ఒక యూనిట్‌ను పెట్టి సంఘాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. కేరళలో అనేక కనీసవేతన చట్టాలను తేవడంలో, వాటిని సక్రమంగా అమలు చేయడంలో ఎల్డీఎఫ్ కృషి మరువలేనిదన్నారు. అందుకే ప్రజలు ఎల్డీఎఫ్ పక్షాన ఉంటున్నారని చెప్పారు.
అడవుల నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టే కుట్ర
ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి
బండారు రవికుమార్
అడవుల నుంచి, భూమి నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టే కుట్రలో భాగంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చట్టాలను చేస్తున్నదని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బండారు రవికుమార్ అన్నారు. ఆదివాసీలకు పరిహారం ఇచ్చినట్టుగా రాష్ట్రపతి పదవి ఇచ్చిన బీజేపీ వారికి నష్టం చేసే, కార్పొరేట్లకు మేలు చేసే నిర్ణయాలను తీసుకుంటున్నదని విమర్శించారు. :హైదరాబాద్‌లో విడిది చేసేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆదివాసీల గోడును వినేందుకు కూడా తమ సంఘాలకు సమయం ఇవ్వడం లేదని వాపోయారు. ఆదివాసీల హక్కుల కోసం తమ సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పారు. కూలిపెంచాలి...భూమి పంచాలి అనే నినాదం ఇచ్చిన వ్యకాస నుంచే తమ సంఘం ఆవిర్భవించిందన్నారు. తమ సంఘం హమారా జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నదని చెప్పారు. వర్గపోరాటాలు మరింత ఉధృతం కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
పోడు పట్టాలిచ్చే దాకా పోరాటం ఆగదు
గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్
రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు దారులందరికీ పోడు పట్టాలిచ్చే దాకా తమ పోరాటం కొనసాగుతుందనీ, వ్యకాసను కలుపుకుని తమ పోరాటాలను ఉధృతం చేస్తామని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్ అన్నారు. రాష్ట్రంలో నాలుగున్న లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే మూడున్నర లక్షల దరఖాస్తులను తిరస్కరించే యోచనలో రాష్ట్ర సర్కారు ఉందన్నారు. 12 లక్షల ఎకరాలు పంచాలని డిమాండ్ ఉంటే కేవలం మూడు లక్షల ఎకరాలను పంచి చేతులు దులుపుకునే పనిలో రాష్ట్ర సర్కారు ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తున్నదన్నారు. ఆ ప్రభుత్వాల తీరును ఎండగడుతూ గిరిజన పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పారు.