Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాడి ఆవుల నుంచి సైనికుల దాకా ప్రతిదీ రాజకీయాలకు వాడుకుంటున్న బీజేపీ
- దుబ్బాకలో చేసేది మేమైతే.. చెప్పుకునేది మరొకరు..
- దుబ్బాక అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ
- మార్కెట్ గోడౌన్, బస్టాండ్‌ను ప్రారంభించిన మంత్రులు
నవతెలంగాణ-దుబ్బాక
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని ప్రతి గడపకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పంచుతున్నది సీఎం కేసీఆర్ సర్కారైతే, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచుడు, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముడు బీజేపీ ప్రభుత్వ వంతుగా ఉందని మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు హరీశ్‌రావు, అజరు కుమార్, నిరంజన్ రెడ్డి, ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు శుక్రవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. హబ్సిపూర్ గ్రామ శివార్లలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన 10 వేల మెట్రిక్ టన్నుల గోదాం సముదాయాలను, దుబ్బాక పట్టణ కేంద్రంలో రూ.3 కోట్లన్నర వ్యయంతో నిర్మించిన మోడల్ బస్టాండ్‌ను ప్రారంభించారు. రాజక్కపేట గ్రామంలో రూ.20 కోట్ల వ్యయంతో దుబ్బాక-రాజక్కపేట రోడ్డు వెడల్పు పనులు, పోతారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాలను, రెడ్డి సంఘం, 33/కేవీ సబ్ స్టేషన్లకు శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు హబ్సిపూర్ నుంచి దుబ్బాక బస్టాండ్ వరకు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి రాష్ట్ర మంత్రులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దుబ్బాకలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన ఏఎంసీ నూతన పాలకవర్గ అభినందన సభలో పాల్గొని వారు మాట్లాడారు.
దుబ్బాకపై సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉందని, అభివృద్ధికై వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని కొనియాడారు. దుబ్బాకలో నూతన మోడల్ బస్టాండ్‌ను నిర్మించామన్నారు. దుబ్బాక నుంచి తిరుపతికి 2 నూతన సూపర్ లగ్జరీ బస్సులను మంజూరు చేసినట్టు, త్వరలోనే మరిన్ని నూతన బస్సులను మంజూరు చేస్తామని చెప్పారు. డబుల్ ఇండ్ల కాలనీలో అంగన్వాడీ కేంద్రం, బస్తీ దవాఖానా, వంద పడకల ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
ఏండ్ల తరబడి ఎండిపోయి ఉన్న కూడవెల్లి వాగు నేడు కాళేశ్వరం నీళ్లతో నిండుకుండను తలపిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో వ్యవసాయ పరిశ్రమలు తెచ్చి గ్రామాల్లోని నూతన ఉపాధి కల్పించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. ప్రతి జిల్లాలో 500 నుంచి 1000 ఎకరాల వరకు ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు స్థాపించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. 2018 ఆగస్టులో మొదలైన రైతుబంధు నేటి వరకు 10 విడతల్లో తెలంగాణ వ్యాప్తంగా 1.53 కోట్ల ఎకరాలకుగాను రూ.65.559 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించామన్నారు. మూడు రోజుల్లో 42 లక్షల ఎకరాలకు రైతుబంధు వచ్చిందన్నారు. బీజేపీ సర్కార్ పాడి ఆవుల నుంచి దేశ సైనికుల దాకా ప్రతీది రాజకీయాలకు వాడుకుంటుందని విమర్శించారు. అధికారంలోకి వస్తే కోట్లలో ఉద్యోగాలు ఇస్తామని, జనధన్ ఖాతాల్లో లక్షల్లో డబ్బులు వేస్తామని చెప్పిన బీజేపీ సర్కార్ ఎప్పుడు వేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముడే బీజేపీ సర్కార్ పని అని విమర్శించారు.
బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అటు దేశానికి, ఇటు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి, వైస్ చైర్పర్సన్ అధికం సుగుణ బాలకిషన్ గౌడ్, జెడ్పీటీసీ కడ్తాల రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.