Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతవిద్వేషాలతో పబ్బం గడుపుకుంటున్న బీజేపీ
- పాలకుల వైఫల్యాలను ఎండగట్టాలి
- క్షేత్రస్థాయిలో పోరాటాలను బలోపేతం చేయాలి : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
ఖమ్మం నుంచి అచ్చిన ప్రశాంత్
వర్గపోరాటంలో విజయం సాధించాలంటే నిరంతరం జనం ఉండాల్సిందేననీ, సమస్యలపై వారి పక్షాన నిలబడి పోరాడాల్సిందేనని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ నొక్కిచెప్పారు. ఖమ్మంలోని వేదగిరి శ్రీనివాసరావు(భక్తరామదాసు కళాక్షేత్రం)లోని అమరవీరుల ప్రాంగణంలో జరుగుతున్న రాష్ట్ర మూడో మహాసభలో ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలతో పబ్బం గడుపుకుంటున్నదని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజలకు, వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతరం ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు భూస్వాముల చేతుల్లో భూమి కేంద్రీకృతం అయ్యి ఉండేదనీ, అనేక పోరాటాల ఫలితంగా కొంతమేరకు భూమి పేదలకు దక్కిందని తెలిపారు. మళ్లీ ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయం పేరుతో భూమిని కొందరి వద్దనే కేంద్రీకృతం చేసే కుట్రకు పూనుకుంటున్నదని విమర్శించారు. రానున్న రోజుల్లో భూ సమస్య తీవ్రం కాబోతున్నదన్నారు. పేదల పక్షాన నిలబడి భూపోరాటాలు చేయాల్సిన గురుతర బాధ్యత వ్యవసాయ కార్మిక సంఘంపై ఉందని నొక్కి చెప్పారు. తెలంగాణ గడ్డకు పోరాటాల వారసత్వం ఉందనీ, దాన్ని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్గపోరాటాలను ఉధృతం చేయాలన్నారు. అప్పుడే ఏ పార్టీ పేదల పక్షమో, ఏ పార్టీ భూస్వాములు, కార్పొరేట్ల పక్షమో అర్ధం అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పోరాటాలతో ఎర్రజెండా వైపు ప్రజలు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో వర్గపోరాటాలను ఉధృతం చేస్తే కమ్యూనిస్టులకు మంచి రోజులు వస్తాయన్నారు. కూలీలకు వ్యవసాయ పనిదినాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పనుల్లేక కూలీలు ఇబ్బందిపడుతున్న సమయంలో ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే పనిలో మోడీ సర్కారు ఉందని విమర్శించారు. వ్యవసాయ కార్మికుల్లో ఎక్కువగా దళితులు, వెనుకబడిన సామాజిక తరగతుల వారే ఉన్నారనీ, కంపెనీ వ్యవసాయం వస్తే ఉన్న కాస్త ఉపాధిని వారు కోల్పోతారని వాపోయారు. దీంతో పట్టణాలకు, గ్రామాలకు వలసలు పెరుగుతున్నాయనీ, అక్కడా సరైన పని లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆర్థిక పోరాటాలకే పరిమితం కాకుండా రాజకీయ, సాంస్కృతిక చైతన్యం కల్పించే ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.