Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ చైతన్యం కల్పించాలి
- ప్రభుత్వ పథకాలపై పాలకులను నిలదీయాలి
- క్షేత్రస్థాయి నుంచి వ్యవసాయ కార్మిక పోరాటాలు ఉధృతం కావాలి
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం
ఖమ్మం నుంచి నవ తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
వ్యవసాయ కార్మికుల్లో ప్రశ్నించే ధైర్యాన్ని నింపాలనీ, వారికి ఏ సమస్య వచ్చినా వ్యవసాయ కార్మిక సంఘం ముందుండి పోరాడాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఖమ్మంలోని వేదగిరి శ్రీనివాసరావు నగర్(భక్తరామదాసు కళాక్షేత్రం)లోని అమరవీరుల ప్రాంగణంలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో ఆయన శనివారం ప్రసంగించారు. గ్రామాల్లో వారు ఆత్మగౌరవంతో బతికేలాగా రాజకీయ చైతన్యం కల్పించాలని సూచించారు. ఆర్థిక పోరాటాలపై పరిమితం చేయకుండా సామాజిక, సాంస్కృతిక పోరాటాల్లో కలిసి వచ్చేలాగా కషి చేయాలన్నారు. కూలీల్లో కుల,మత, ఎక్కువ, తక్కువ అనే భావనను పోగొట్టాలన్నారు. వారంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడేలా చైతన్యపరచాలన్నారు. ప్రతి పోరాటం వర్గ పోరాటం కాదన్నారు. గ్రామాల్లో భూస్వాములు చేతుల్లో ఉన్న మిగులు భూములను వెలికి తీసి పేదలకు పంచేలాగా పోరాటం చేయాలన్నారు. వర్గ పోరాటాల ద్వారానే ఉద్యమాలు బలపడతాయన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక వర్గ పోరాటం అన్నారు. ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచడం వల్లనే నేటికీ ఆ పోరాటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. అలాంటి పోరాటాలు నేడు చేయాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. బిజెపి అనుబంధ సంఘాలు స్వతంత్రంగా తమ భావజాలాన్ని ప్రజల్లోకి ఎక్కిస్తున్నాయన్నారు. దీన్ని వ్యవసాయ కార్మిక సంఘం తిప్పి కొట్టేలాగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం పోరాటాలను ఉధృతం చేయాలన్నారు. ఇతర ప్రజా, వ్యవసాయ కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలను నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కిచెప్పారు.
మహిళల అణచివేత తీవ్రం : మల్లు లక్ష్మి
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, లైంగిక దాడులు తీవ్రం అయ్యాయని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో ఆమె సౌహార్ధ్ర సందేశాన్ని ఇచ్చారు. మనుస్మృతిని తీసుకొచ్చి మళ్లీ మహిళలను వంటింటికి పరిమితం చేసే తిరోగమన విధానాల వైపు బీజేపీ నాలన ఉందని విమర్శించారు. వ్యవసాయ కూలీల్లో మహిళలే ఎక్కువ అన్నారు. ఖమ్మంలో జరిగిన బహిరంగ సభ విజయవంతం అయిందనీ, పేదలు కమ్యూనిస్టుల వైపు ఉంటారని నిరూపితం అయిందని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం చేసే పోరాటాల్లో తమ వంతు సహకారం ఉంటుందని హామీనిచ్చారు.
రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర :స్కైలాబ్‌బాబు
దేశంలో రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలనుద్దేశించి ఆయన శనివారం సౌహార్ద్ర సందేశాన్ని ఇచ్చారు. రిజర్వేషన్లను ఎత్తివేస్తే ఎక్కువగా నష్టపోయేది వ్యవసాయ కార్మికులేనన్నారు. రాష్ట్రంలో 76 కులదురంహకారం హత్యలు జరిగాయన్నారు. మరోవైపు ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, తదితర జిల్లాల్లో వీడీసీల పేరుతో దళితులను అణచివేస్తున్న, గ్రామ బహిష్కరణ చేస్తున్న తీరును వివరించారు. వ్యవసాయ కార్మిక సంఘం చేసే పోరాటాల్లో కేవీపీఎస్ కూడా కలిసి వస్తుందని హామీనిచ్చారు.
- వలస పక్షుల్లా వ్యవసాయ కార్మికులు..
- కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలి
- ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు దడాల సుబ్బారావు
తెలంగాణలో చేస్తున్నట్టు ఏపీలోనూ 245 కేంద్రాల్లో 40 వేలకు పైగా ఎకరాల్లో భూ పోరాటం చేస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు చెప్పారు. ఏపీలో పాలకులు అనుసరిస్తున్న విధానాలు, యాంత్రీకరణతో వ్యవసాయ కార్మికులు వలస పక్షుల్లా మారిపోయారని వాపోయారు. ఖమ్మంలోని వేదగిరి శ్రీనివాసరావు నగర్(భక్తరామదాసు కళాక్షేత్రం)లోని అమరవీరుల ప్రాంగణంలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో ఆయన శనివారం ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోటి 20 లక్షల ఎకరాల మిగులు భూమి ఉందని దాన్ని పేదలకు పెంచాలని కోనేరు రంగారావు కమిటీ సూచించిందని తెలిపారు. ఆ కమిషన్ సిఫారసులను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు కూలిపోరాటాలకు ఆటంకంగా మారుతున్నాయని చెప్పారు.
- వ్యవసాయ కూలీలకు కనీస వేతన చట్టం అమలు చేయాలి
- పలు కమిషన్ల రిపోర్టులను సమర్పించిన కమిటీలు
వ్యవసాయ కూలీలకు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలనీ, వాటి కోసం పోరాటాలను ఉధృతం చేయాలని రాష్ట్ర మహాసభ నిర్ణయించింది. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలో పలు కమిషన్లను మహాసభ ముందు పెట్టారు. వేతన కమిషన్‌ను ఆ సంఘం రాష్ట్ర నాయకులు సాంబశివ మహాసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, వలస కార్మికులు, తదితర కారణాల వల్ల వ్యవసాయ కూలీల పనిదినాలు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాట్లు, కోతల సమయంలో తప్ప కూలీల కొరత అనేదే ఉండట్లేదన్నారు. సగటున ఒక్కో వ్యవసాయ కార్మికునికి 100 నుంచి 120 రోజుల పనిదినాలే దక్కుతున్నాయని చెప్పారు. భూ సమస్యల కమిషన్ రిపోర్టును మచ్చా వెంకటేశ్వర్లు సమర్పించారు. పోడు భూముల హక్కు పత్రాల కోసం పోరాటాలను ఉధృతం చేయాలన్నారు. ధరణి పోర్టల్ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. భూపోరాటాలను తీవ్రం చేయాలని సూచించారు. ఉపాధి హామీ చట్టంపై బత్తుల వెంకటేశ్వర్లు కమిషన్‌ను ప్రవేశపెట్టారు. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం నిధులను తగ్గిస్తూ పోతున్నదనీ, అమలు విషయంలో అనేక కొర్రీలు పెడుతూ తెలంగాణ అన్యాయం చేస్తున్నదని చెప్పారు. ఆ చట్టాన్ని రక్షించుకునేందుకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెండింగ్ వేతనాల విడుదల కోసం పోరాటాలు చేయనున్నట్టు తెలిపారు. సేవా, సాంస్కృతిక రంగాల్లో వ్యవసాయ కార్మిక సంఘం మునుముందు చేయాల్సిన కార్యక్రమాల గురించి చెబుతూ కమిషన్‌ను గడ్డం స్వామి ప్రవేశపెట్టారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్నారు. గ్రామాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న మనువాద భావజాలాన్ని ఎక్కడిక్కడ అడ్డుకట్ట వేయడంలో వ్యవసాయ కార్మిక సంఘం తన వంతు పాత్ర పోషించాలన్నారు. సాంస్కృతిక రంగంలోనూ వర్గపోరాటం చేయాలన్నారు. సామాన్య సమస్యలపై కమిషన్‌ను సమర్పిస్తూ జగన్ మాట్లాడారు. మోడీ సర్కారు హయాంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, తగ్గుతున్న నిజవేతనాలతో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. నిర్మాణరంగ కమిషన్‌ను కొండమడుగు నర్సింహ్మ, సోషల్‌మీడియా కమిషన్‌ను శ్రీనివాసరావు సమర్పించారు. మహిళల సమస్యలపై వినోద కమిషన్‌ను ప్రవేశపెడుతూ మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం ఎక్కడా అమలు కావడం లేదన్నారు. కూలిరేట్ల విషయంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. పనిప్రదేశాల్లో మహిళలపై దాడులు జరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై సుధీర్ఘ పోరాటాలు చేయాలని మహాసభ నిర్ణయించింది.