Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనోవైజ్ఞానిక నిపుణుల సిఫారసులను పట్టించుకోని విద్యాశాఖ
- ఆదివారం పరీక్షలతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి
- కార్పొరేట్ సంస్కృతిని పెంచేలా అధికారుల తీరు
- ఉదయం.. సాయంత్రం ప్రత్యేక తరగతులు సరే
- విద్యార్థులకు అల్పాహారం, స్నాక్స్ సంగతేంటీ?
- ఎస్సీఈఆర్టీ సర్క్యులర్‌పై సర్వత్రా విమర్శలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాస్త్రీయ విద్యావిధానాన్ని అమలు చేయాల్సిన విద్యాశాఖ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అశాస్త్రీయ పద్ధతులకు అధికార ముద్ర వేయడం ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మనోవైజ్ఞానిక నిపుణుల సిఫారసులను పట్టించుకోకపోవడం గమనార్హం. పాఠశాల పనివేళలకు అదనంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను తీసుకోవాలంటూ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) గతనెల 30న సర్క్యులర్‌ను జారీ చేసింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరు కావాలంటే వారికి అల్పాహారం, స్నాక్స్ సంగతేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో అత్యధికమంది పేదలు, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ తరగతులకు చెందిన వారే ఉంటారు. వారికి ఇంటి నుంచి టిఫిన్ తెచ్చుకునే అలవాటు ఉండదు. సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడే విద్యార్థులే ఎక్కువ మంది ఉంటారు. అయితే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఉంటాయన్న విద్యాశాఖ విద్యార్థులకు సంబంధించిన అల్పాహారం, స్నాక్స్ గురించి ప్రస్తావించలేదు. ఇంకోవైపు విద్యార్థులు వారంలో ఆరు రోజులు బడికి వచ్చి ఆదివారం సెలవు తీసుకుంటారు. కానీ ఎస్సీఈఆర్టీ అధికారులు కార్పొరేట్ విద్యాసంస్కృని సర్కారు బడుల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం ఖాళీ లేకుండా పరీక్షలను నిర్వహించాలంటూ ఆదేశించారు. విద్యావ్యాపారాన్ని కట్టడి చేసి బాలల హక్కులను కాపాడాల్సిన విద్యాశాఖ ఇలాంటి అశాస్త్రీయమైన నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. ఉపాధ్యాయులు ఒకరో, ఇద్దరో వెళ్లి పరీక్షలను నిర్వహిస్తారు. కానీ విద్యార్థుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అందుకే ఈ సర్క్యులర్‌ను జారీ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థులపై పెనుభారం
పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులకోసం ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు తీసుకుని స్వచ్చందంగా కొందరు ఉపాధ్యాయులు తొలినాళ్లలో బోధించేవారు. తర్వాత జిల్లా కలెక్టర్లు, డీఈఓల మౌఖిక ఆదేశాలతో అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను తప్పనిసరి చేశారు. ఉపాధ్యాయులు కూడా కాదనకుండా బాధ్యతగానే బోధిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా ఎస్సీఈఆర్టీ సర్క్యులర్ ద్వారా అధికారిక ఆదేశాలే ఇచ్చింది. అయితే వారంలో ఒక్కరోజు కూడా వెసులుబాటు ఇవ్వకుంటే విద్యార్థులపై మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. వారి సృజనాత్మకతపై ప్రభావం చూపుతుంది. వరుస తరగతులు, పరీక్షలతో పెనుభారం పడనుంది. ఇది బాలల హక్కులను హరించటం కాదా...?అంటూ ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
అల్పాహారానికి బడ్జెట్ కేటాయించాలి : చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
ఉపాధ్యాయులు ఎన్నో ఏండ్ల నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులే దాతల సహాయంతో పిల్లలకు సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా సర్క్యులర్ ఇచ్చింది. కనుక అల్పాహారానికి బడ్జెట్ కేటాయించాలి. ఆదివారం పిల్లలకు ఆటవిడుపుగా ఉండాలి. వారాంతపు పరీక్షల పేరిట పిల్లలపై ఒత్తిడి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.