Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్మం నాలుగు కృత్రిమ కాళ్లపై ఉంది
- వ్యవస్థలన్నీ కలుషితమయ్యాయి
- త్యాగాల పక్షానే తెలంగాణ సినిమా
- హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సదస్సులో దర్శకుడు ఎన్ శంకర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మనిషికీ, మానవత్వానికి మతాన్ని అంటగట్టొద్దని ప్రముఖ సినీ దర్శకులు ఎన్ శంకర్ అన్నారు. ప్రస్తుతం వ్యవస్థలన్నీ కలుషితమై ఉన్నాయనీ, ధర్మం నాలుగు కృత్రిమ కాళ్లపై నిలబడి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే, కచ్చితంగా తెలంగాణ సినిమా త్యాగాల పక్షానే నిలుస్తుందని స్పష్టంచేశారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్, ప్రభుత్వ సిటీ కళాశాల సాంస్కృతిక విభాగం సంయుక్తాధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన 'సమకాలీన సినిమా' అంశంపై అలిశెట్టి ప్రభాకర్ వేదికపై సదస్సు జరిగింది. దీనికి ఎన్ శంకర్ ముఖ్య అతిధిగా హాజరై, మాట్లాడారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సమకాలీన, సమాంతర సినిమా ప్రజలతో సంబంధం లేకుండా సినీ మాఫియా తన్నేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలు బతికే పరిస్థితులు లేవనీ, ఎక్కడో ఒకటి రెండు చిత్రాలను ఉదాహరణగా చూపి, చిన్న సినిమా బతికే ఉందని ప్రచారం చేస్తున్నారనీ, ఆ కష్టం నిర్మాతలకే తెలుస్తుందన్నారు. నిర్మాత, దర్శకుడిని నమ్మి సినిమాలు చేసే ధైర్యం ఇప్పుడున్న హీరోలకు లేదని చెప్పారు. సినిమా ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటుందనీ, అది వ్యాపారంతో కూడిన కళ అని విశ్లేషించారు.
ఈ సినిమా నాది అని హీరోలు ప్రమోట్ చేసుకొనే పరిస్థితులు దాపురించాయనీ, మరి నిర్మాత, దర్శకుడి పాత్ర ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో నిర్మాత, దర్శకుడిపై నమ్మకంతో గ్లామర్ లేని సామాన్యుల పాత్రలు వేసి ప్రేక్షకుల్ని మెప్పించారనీ, ఇప్పుడు దానికి పూర్తిభిన్నంగా హీరో పాత్రలు ఉంటున్నాయని చెప్పారు. ప్రస్తుతం సమాజానికి కావల్సింది శ్రీరాముడు కాదనీ, త్యాగం చేసిన ఆంజనేయులు కావాలని అన్నారు. శ్రీరాముడు రావణాసురుడిని చంపడానికి అష్టకష్టాలు పడ్డాడనీ, కానీ ఆంజనేయుడు సీతను వెతికి, లంకను తగులబెట్టి త్యాగానికి చిహ్నంగా మిగిలాడనీ, కానీ ఆ త్యాగాన్ని హీరోయిజంగా చూపించాలని చెప్పారు. భారతంలో శ్రీకృష్ణుడి లాజిక్ అర్థంకాదన్నారు. సైన్యం దుర్యోధనుడికి, తానొక్కడు పాండవుల పక్షంలో ఉండటం ఏం లాజిక్ అని ప్రశ్నించారు. కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న ఆదివాసీలు, మూలవాసులు బానిసల త్యాగాలు భవిష్యత్ తరాలకు చెప్పాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మత పోరాటాలతో ప్రజల్లో విద్వేషాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తుంటారని హెచ్చరించారు. భీమ్లానాయక్ చిత్ర దర్శకులు సాగర్ చంద్ర మాట్లాడుతూ స్థానిక సంస్కృతి, సంప్రదాయాల లోతుల్లోకి ఎంత అధ్యయనం చేస్తే, అన్ని కథావస్తువులు దొరుకుతాయంటూ 'కాంతారా' చిత్రాన్ని ఉదహరించారు. 'మోర్ లోకల్-మోర్ గ్లోబల్' అని చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ విశ్లేషకులు రెంటాల జయదేవ, సినీ దర్శకులు వేణుశ్రీరామ్ (వకీల్‌సాబ్), భరత్ కమ్మ (డియర్ కామ్రేడ్), ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ బాల భాస్కర్, ప్రొఫెసర్ నీరజ తదితరులు పాల్గొన్నారు.