Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబానికి వ్యవసాయం.. అదానీకి గోదాములు
- ప్రాంతీయ పార్టీల వైఖరీపైనా చర్చిస్తున్నాం
- వ్యకాస పార్టీ కాదు.. రాజకీయాలకు అతీతం కాదు
- జర్నలిస్టుల సమస్యలపైనా మహాసభలో తీర్మానం
- ముదిగొండలాంటి మరో భూ పోరాటానికి సమాయత్తం : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆహార భద్రతను దెబ్బతీసి.. కార్పొరేట్ల చేతుల్లో వ్యవసాయాన్ని పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అది దేశానికి అత్యంత ప్రమాదకరమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. కార్పొరేట్ వ్యవసాయం అంటే ధనికుల సాగు ఒక్కటే కాదు.. ఇప్పుడు ఇది అంబానీ వ్యవసాయం అన్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ని రద్దు చేస్తున్నామని అదానికి సంకేతం ఇవ్వడమే కాకుండా రూ.వేల కోట్లు గోదాముల నిర్మాణానికి సైతం రుణాలిచ్చారని ఆరోపించారు. భారత వ్యవసాయాన్ని కాపాడు కోవడంతోపాటు ఆహార భద్రతను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభ ముగింపు సందర్భంగా శనివారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలోని వేదగిరి శ్రీనివాసరావు నగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
భారత రాజ్యాంగం ఉండాలని తాము కోరుకుంటుంటే.. దాని స్థానంలో ఆర్ఎస్ఎస్ ఎజెండా ఉండాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. రాష్ట్రపతి భద్రాచలం వస్తే ప్రజాసంఘాల నాయకులు ఆమెను కలవకుండా వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ వర్కింగ్ కమిటీ మెంబర్ మచ్చా వెంకటేశ్వర్లును నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూములపై రాష్ట్రపతి స్పందించి వుంటే బాగుండేద న్నారు. రాజ్యాంగ ప్రథమ పౌరురాలిగా ఉన్న రాష్ట్రపతి విధులను సైతం బీజేపీ ఆటంకపరుస్తోంద న్నారు. అంటరానితనం నిర్మూలనకు కేరళలో దళితులను పూజారులుగా నియమించారని, ఇదే స్ఫూర్తితో తమిళనాడులోనూ నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. వ్యవసాయంలో సాధించిన సమృద్ధిని దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. విద్యుత్ బిల్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి ఆ రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు.
కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 20 నుంచి ఏప్రిల్ 5 వరకు దేశవ్యాప్త కాంపెయిన్ తీసుకుంటున్నామని తెలిపారు. దీనిలో భాగంగా తెలంగాణలో నాలుగు దశల్లో కాంపెయిన్ ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా పది కోట్ల కుటుంబాలను కలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నా మన్నారు. తెలంగాణలో కనీసం 75 లక్షల కుటుం బాలను కలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. నెలరోజులపాటు పాదయాత్రలు చేస్తూ కార్పొరేట్ వ్యవసాయాన్ని రద్దు చేయాలి, వ్యవసాయ కార్మికులను కాపాడుకోవాలి, కార్మిక కోడ్లు రద్దు కావాలనే డిమాండ్‌తో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. మార్చిలో దేశవ్యాప్తంగా విస్తృతంగా సభలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఏప్రిల్ 5న లక్షల మందితో 'మార్చ్ టూ పార్లమెంట్' చేపట్టనున్నట్టు చెప్పారు. వ్యవసాయం, భూములు, ఉపాధిహామీ చట్టాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ప్రాంతీయ పార్టీల వైఖరీపైనా మహాసభలో చర్చిస్తున్నామన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాజకీయ పార్టీ కాదని, అయితే రాజకీయాలకు తాము అతీతం కాదన్నారు. తమ సంఘం ప్రధాన కర్తవ్యాల్లో కేంద్రంలో బీజేపీని ఓడించటం ఒకటన్నారు. ప్రాంతీయ పార్టీలు వ్యవసాయ కార్మికుల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు చేపట్టడం లేదన్నారు. రెండెకరాల భూమి ఇవ్వండి.. రూపాయి బియ్యాన్ని వ్యవసాయ కార్మికులు వదులుకుంటారని చెప్పారు. ఇప్పటికీ తెలంగాణలో 28శాతం భూమి 2శాతంగా ఉన్న ధనికుల చేతిలో ఉందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న కంపెనీకి ఖమ్మం జిల్లాలో ఐదెకరాలు ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న 5 లక్షల ఎకరాలు ప్రస్తుతం రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులకు చెందిన కంపెనీల చేతిలో ఉన్నాయన్నారు. కేసీఆర్, జగన్ కంపెనీలకు భూములు ఇస్తారా? పేదలకు ఇస్తారా? తేల్చాలని పాలకులను నిలదీశారు. ఏప్రిల్ 5వ తేదీ తర్వాతగానీ, ఆలోపుగానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముదిగొండ తరహా మరో భూపోరాటానికి సిద్ధం చేస్తున్నామని చెప్పారు. భూపోరాటాలు, ఇండ్లస్థలాల పోరాటాలు, కూలి పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం భూమిని పంచుతుందా? లేక తమని పంచుకోమంటారా? అని ప్రశ్నించారు. జర్నలిస్టుల సమస్యలపైనా మహాసభలో చర్చించినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ వెంటనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. సాగుదారులకే రైతుబంధు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ కూలీలకూ కూలిబంధు పెట్టాలని డిమాండ్ చేశారు.
సాదాబైనామా మీద కొనుగోలు చేసిన భూములకు 58, 59 జీవో ప్రకారం పట్టాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డబుల్బెడ్రూం ఇండ్లకు 40 లక్షల దరఖాస్తులు వస్తే ఇప్పటి వరకు 36వేలు మాత్రమే ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇండ్లస్థలాలు లేవన్నారు. పేదలందరికీ భూములు పంచాలి, కనీస వేతనాల చట్టాన్ని సవరించాలి, రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం మహాసభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఏఐఏడబ్ల్యూయూ కేంద్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, నారి ఐలయ్య, రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య, సీఐటీయూ నాయకులు బుర్రి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.