Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన సంక్షేమంతోపాటు, మహిళ, శిశు సంక్షేమానికి చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత ఏడాది కాలంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ద్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రం ఎర్పడిన అనతికాలంలోనే విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, రవాణా, పరిపాలన వికేంద్రికరణ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చేసి అభివృద్ధి పథంలో రాష్ట్రం వేగంగా దూసుకు పోతున్నదన్నారు. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లు 6శాతం నుంచి 10శాతానికి పెంచడంతో, గిరిజనులకు విద్య, ఉద్యోగ, ఉపాది రంగాల్లో అవకాశాలు పెరిగాయని తెలిపారు. అర్హులైన పోడు రైతులకు త్వరలో పట్టాలు అందించబోతున్నామన్నారు. విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా వేయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. 183 గిరిజన గురుకులాలకు తోడు.. నూతనంగా మరో మూడు గురుకులాలను ప్రారంభించబోతున్నామని తెలిపారు. గిరిజన విద్యార్ధులకు ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్ధాయి పోటీపరిక్షలకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు సుమారు 1200 మంది గిరిజన విద్యార్ధులు దేశ వ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలు పొందారని తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి పేద విద్యార్థులకు 20 లక్షల రూపాయల ఆర్ధిక సహయాన్ని అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్ షిప్ పేరిట అందజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 3,146 గిరిజన తాండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు పంచాయతీ భవనాల నిర్మాణల కొసం ఒక్కో భవనానికి రూ.20లక్షల చొప్పున నిధులు కేటాయించామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలను నెలకొల్పాలనీ, ఆ దిశగా ఇప్పటికే 12 మేడికల్ కాలేజిలను ప్రారంభించుకు న్నామని తెలిపారు. షెడ్యూల్ తెగల యువతీ, యువకులను పారిశ్రామిక వెత్తలుగా తీర్చిదిద్దాడానికీ, వారిని ప్రోత్సహించడానికి భారీ మొత్తంలో సబ్సిడీ ఇస్తూ '' సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్నోవేషన్ స్కీమ్'' అమలు చేస్తున్నా మన్నారు. ఈ పథకం వల్ల ప్రతి ఏడాది వందల మంది పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్నారని చెప్పారు. ప్రతి గిరిజన ఆవాసానికి బీటీ రోడ్డు సౌకర్యం ఉండాలనే లక్ష్యానికి అనుగుణంగా మారుమూల తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేశామన్నారు. ఈ ఏడాది 12,475 గిరిజన ఆవాసాలకు బిటీ రోడ్ల సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం రూ.1000 కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. గిరిజన సంక్షేమంతో పాటు మహిళ, శిశు సంక్షేమానికి పెద్ద పీట వేసా మన్నారు. అనంతరం డీఎస్ఎస్ భవన్లో ఎస్ఆర్ శంకరన్ సమావేశ మంది రాన్ని ప్రారంభించారు. అధికారులతో కలిసి కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విలేకర్ల సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, సి.ఈ శంకర్, జేడీ. కళ్యాణ్ రెడ్డి, జీ సి సీజీఎం సీతారాంనాయక్ , ట్రైకార్ జీఎం శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.