Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2,3 మార్కుల ప్రశ్నలకు 30 శాతం ఛాయిస్ ఇవ్వాలి
- మంత్రి సబితకు పీఆర్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి ప్రశ్నాపత్రాల కూర్పుతో విద్యార్థులు పలు ఇబ్బందులకు గురయ్యే అవకాశముందని పీఆర్టీయూటీఎస్ తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శనివారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. గతంలో రెండు పేపర్లు ఉన్న సబ్జెక్టులను ఒకే పేపర్‌గా మార్చారని తెలిపారు. రెండు, మూడు మార్కులకు చెందిన ప్రశ్నలకు ఛాయిస్ లేకుండా చేయడం ఇబ్బందికరమని పేర్కొన్నారు. వాటికి కూడా 30 శాతం ఛాయిస్ ఇవ్వాలని కోరారు. వ్యాసరూప ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంఖ్యను నాలుగుకు తగ్గించాలని సూచించారు. భౌతిక, రసాయన శాస్త్రాలు, జీవశాస్త్రం పేపర్లను ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని తెలిపారు. సగటు, అంతకన్నా తక్కువ స్థాయి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాలని కోరారు.