Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సకాలంలో పనులు పూర్తి చేయాలి
- కేంద్రం కావాలని నిధులు ఆపడం వల్ల ఇబ్బందులు : వీడియో కాన్ఫరెన్సులో మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పంచాయతీ రోడ్లు అద్దంలా ఉండా లనీ, వర్షాకాలంలో మొదటి వర్షం పడేటప్పటికీ ఏ ఒక్క రోడ్డు మీద గుంత కనిపించొద్దని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. రోడ్లపై గుంతలు ఉండకుండా, రోడ్లన్ని బాగుండేలా చర్యలు చేపట్టాలని సూచించాఆరు. శనివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలోని మంత్రి ఛాంబర్లో జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో మంత్రి సమావేశమయ్యారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ ఆఫీసర్లు, మండల పంచాయతీ ఆఫీసర్లు, డీఆర్వో అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మొదటగా అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బంది కృషి వల్ల జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. ఈ స్పూర్తిని ఇదేవిధంగా కొనసాగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆర్ధికంగా ఇబ్బంది ఏర్పడిందన్నారు. కేంద్రం నుంచి రూ.1100 కోట్లు రావల్సి ఉండగా వాటిని విడుదల చేయటం లేదని చెప్పారు. రైతు కల్లాల కోసం రూ.151 కోట్లు ఖర్చు చేయడం తప్పుగా భావించి రాష్ట్రానికి రావాల్సిన రూ.1100 కోట్లను కేంద్రం ఆపడాన్ని తప్పుబట్టారు. కేంద్రం ఇస్తున్న గ్రాంట్ కు సమానంగా గ్రాంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణనే అన్నారు. సర్పంచులకు అన్ని విధాల అధికారాలు ఇచ్చామన్నారు. కొంతమంది సర్పంచులు ప్రభుత్వం చేస్తున్న పనులను గుర్తించకుండా అనవసరంగా బిజెపి ట్రాప్లో పడి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.ఎనిమిదేండ్లలో వచ్చిన నిధులు అంతకుముందు 50 ఏండ్లలో రాలేదన్నారు. ఈ కాన్ఫరెన్సులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవ రావు, కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.