Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు రేవంత్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎండనక, వాననక కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కడం లేదనీ, వారికి అండగా నిలబడాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. దళారులు రైతును దగా చేస్తుంటే వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని పేర్కొన్నారు. ఈమేరకు శనివారం సీఎం కేసీఆర్కు రేవంత్రెడ్డి లేఖ రాశారు. పంట ఏదైనా వ్యాపారులు, దళారులు చెప్పిందే రేటు అన్నట్టుగా పరిస్థితి తయారైందని తెలిపారు. ఇంతటి విపత్కార పరిస్థితుల మధ్య ఉన్న రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుంటే..రైతులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. వానలు, చీడపీడల బెడదను తట్టుకుని పండిన పత్తిని చూసి రైతన్న ఆనందం మార్కెట్లో ధర చూడగానే ఆవిరైపోతున్నదని పేర్కొన్నారు. దళారుల రాజ్యంలో గిట్టుబాటు ధర రాకపోవడంతో రోడ్డెక్కి ఆందోళ చేయాల్సిన స్థితి దాపురించిందని తెలిపారు. పెట్టిన పెట్టుబడిని పరిగణనలో తీసుకుంటే కనీసం రూ.15 వేలు రాకుంటే గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులున్నారనీ, ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతుల్లో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని గుర్తు చేశారు. తక్షణమే ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల సంక్షోభంపై దృష్టి సారించాల్సిన అవసరముందని కోరారు. 'పత్తికి క్వింటాలుకు రూ. 15 వేలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. తక్షణం రూ.లక్ష రుణమాఫీ అమలు చేయాలి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల ప్రయివేటు అప్పులను వన్ టైం సెటిల్మెంటు కింద పరిష్కరించేలా ప్రభుత్వ వ్యవస్థలు చొరవ తీసుకోవాలి. కౌలు రైతులను కూడా రైతులుగా గుర్తించి, రైతులకు వర్తించే అన్నీ పథకాలను వారికి కూడా వర్తింపజేయాలి. పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలి' అని పేర్కొన్నారు.
రైతు కష్టాలను పరిష్కరించాలి : కోదండరెడ్డి
రైతు కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి చెప్పారు. ప్రభుత్వం వడ్లు కొనక రైతులు వడ్ల కుప్పలపైనే ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. పంట నష్ట పరిహారం అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.