Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెడ్కో చైర్మెన్ సతీష్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి టీ హరీశ్‌రావు సమక్షంలోనే భైరి నరేశ్ అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదనీ, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని రెడ్కో చైర్మెన్ వై సతీష్‌రెడ్డి అన్నారు. పాత వీడియోను ప్రస్తుత వీడియో అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు. గతేడాది సిద్దిపేటలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారనీ, ఇదే కార్యక్రమంలో బైరి నరేశ్ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడారని చెప్పారు. ఆ తర్వాత మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు గారు భైరి నరేశ్ ప్రసంగించిన తీరును అభినందించారని తెలిపారు. అప్పటికార్యక్రమాన్ని... ఇప్పుడు జరిగినట్టుగా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు.ఆ పార్టీ ఇలాంటి తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు. కోట్లాది మంది ప్రజలు పూజించే అయ్యప్పస్వామిపై భైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఎవరు ఏ మతాన్ని కించపరిచినా ఆమోదనీయం కాదనీ, తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమదష్టితో చూస్తుందన్నారు. హిందూమతంలో అయినా.. ఇతర మతాల మధ్య అయినా చిచ్చుపెట్టేలా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు.