Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజువిడిచి రోజు పరీక్షలు నిర్వహించాలి
- విద్యాశాఖ కార్యదర్శికి టీఎస్‌యూటీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి ప్రశ్నాపత్రంలో అన్ని సెక్షన్లలోని ప్రశ్నలకూ ఛాయిస్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏప్రిల్ మూడో తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను రోజువిడిచి రోజు నిర్వహించాలని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యా డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ను టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి శనివారం వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే నిర్వహించాలని నిర్ణయించటం అభినందనీయమని తెలిపారు. ప్రస్తుతం విడుదలైన మోడల్ పేపర్లు సగటు, అంతకంటే తక్కువ స్థాయి గల విద్యార్థులకు చాలా క్లిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. తొలిసారిగా పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థుల స్థాయికి తగిన విధంగా ప్రశ్నాపత్రం రూపొందించటం అవసరమని సూచించారు. రెండేండ్ల కోవిడ్ మహమ్మారి కారణంగా భౌతికంగా తరగతులు జరగలేదని గుర్తు చేశారు. విద్యార్థులు ఆన్లైన్ తరగతులు సరిగా వినలేక పోయారని వివరించారు. అందువల్ల అభ్యసనా సామర్థ్యాలు తగ్గిపోయాయని తెలిపారు. ప్రాథమిక అంశాలపై అవగాహన తగ్గిందని పేర్కొన్నారు. ఈ ఏడాది పూర్తి సిలబస్‌తో ప్రశ్నాపత్రం ఉన్నందున దానిపై పట్టు సాధించటం సగటు విద్యార్థికి కష్ట సాధ్యమని వివరించారు. ఉన్నత విద్య పరీక్షల పేపర్లలో కూడా అన్ని విభాగాల్లో ఛాయిస్ ఇస్తున్నారని గుర్తు చేశారు. సీబీఎస్ఈలో పరీక్షకు, పరీక్షకు మధ్య సెలవులిస్తారనీ, ఆ విధానాన్ని పదో తరగతి పరీక్షల్లోనూ అమలు చేయాలని కోరారు.
- రెండు పేపర్లకు బదులుగా ఒక పేపర్ ఇస్తుండడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఒకటి, రెండు సెక్షన్లలో కూడా ఛాయిస్ ఇవ్వాలి. రెండు మార్కులు, మూడు మార్కుల ప్రశ్నలకు కనీసం 30 శాతం ఛాయిస్ ఇవ్వాలి.
- మూడో సెక్షన్లో వ్యాస రూప ప్రశ్నల సంఖ్యను ఆరు నుంచి నాలుగుకు తగ్గించాలి.
- ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పరీక్షలు ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలి.
- పరీక్షలు ప్రతిరోజూ కాకుండా రోజు విడిచి రోజు చొప్పున నిర్వహించాలి. తద్వారా ప్రిపరేషన్ సులభమౌతుంది.
- సగటు విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పదోతరగతి పరీక్షల ప్రశ్నాపత్రాన్ని రూపొందించి పరీక్షలను నిర్వహించాలి.