Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ వీసీ ప్రొ. రవీందర్ యాదవ్
- యూనివర్సిటీలో యాంఫీ థియేటర్‌కు శంకుస్థాపన
నవతెలంగాణ-ఓయూ
ఓయూ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావటం అభినందనీయమని వీసీ ప్రొఫెసర్ రవీందర్‌యాదవ్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో డా.గుర్రం నాగయ్య ఓపెన్ ఎయిర్ థియేటర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఓయూ పూర్వ విద్యార్థి, సిద్ధార్థ గ్రూప్ విద్యాసంస్థల చైర్మెన్ డా.నాగయ్య తన పేరు మీద 'యాంఫీ థియేటర్' నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఠాగూర్ ఆడిటోరియం పక్కనే ఈ థియేటర్ నిర్మించేందుకు వీసీ రవీందర్ యాదవ్, రిజిస్ట్రార్ ప్రొ. పి.లక్ష్మీనారాయణ, డాక్టర్ నాగయ్యతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. సుమారు రూ.50 లక్షలతో ఈ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. తనకు విద్యాబుద్దులు నేర్పి తనను ఇంతటివాడిని చేసిన ఓయూకు తిరిగి ఏదైనా చేయాలనే కోరిక ఉండేదని, ఓపెన్ ఎయిర్ థియేటర్ కట్టేందుకు అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని అన్నారు. వీసీ రవీందర్‌యాదవ్ మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు ఉస్మానియా అభివృద్ధికి ముందుకు రావటం సంతోషంగా ఉందన్నారు. గ్లోబల్ అలుమ్నీ మీట్‌కు ముందే ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మాణానికి డాక్టర్ జి.నాగయ్య ముందుకు రావటం తొలి మెట్టని చెప్పారు. ఇంకా ఎంతో మంది ఉన్నత శిఖరాలు అధిరోహించారని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఉస్మానియా పునఃవైభవానికి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ సందర్భంగా నాగయ్యను అభినందించారు. ఉస్మానియా సమగ్ర అభివృద్ధికి నాగయ్య లాంటి వ్యక్తులు ముందుకు వస్తున్నారని, గ్లోబల్ అలుమ్నీ మీట్ ద్వారా దశాబ్దాలుగా ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ విద్యార్థులు కలుసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొ. లక్ష్మీనారాయణ అన్నారు. విద్యార్థులకు మౌలిక వసతుల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్.సి.డి.సి డైరెక్టర్ ప్రొ.స్టీవెన్సన్, డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, సిద్ధార్థ గ్రూప్ విద్యా సంస్థల డెరైక్టర్లు వంశీకృష్ణ, మోహన్ రావు, కార్తీక్, ప్రిన్సిపాల్ జి.గోవర్ధిని, త్రివేణి, సిద్ధార్థ్, పలువురు సీనియర్ అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.