Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
ఖమ్మం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానంతో అందరికీ విద్య అందదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఖమ్మంలోని వేదగిరి శ్రీనివాసరావు నగర్ లోని అమరవీరుల ప్రాంగణం లో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలో ఆయన మాట్లాడారు. ఒకటెండ్రు రూముల్లో కొనసాగుతున్న ఆంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, బాలింతలకు, గర్భిణీలకు ఆహారం అందించడం, వంట చేయడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తర్వాత అత్యధిక జాబ్చార్టు ఉన్నదని బహుశా అంగన్వాడీకేనని చెప్పారు. ఇప్పటివరకు నిబంధనలకు విరుద్ధంగా ప్రయివేటు రంగంలో కొనసాగుతున్న పూర్వప్రాథమిక విద్య చట్టబద్ధం చేసి కార్పొరేట్లకు అప్పగించే యత్నంలో భాగంగానే నూతన విద్యావిధానం వచ్చిందన్నారు. పాఠ్యపుస్తకాల్లో చరిత్రను వక్రీకరించి రాయడం దుర్మార్గమన్నారు. అందరికీ ఒకే గౌరవం అనేది దేశంలో ఎక్కడ అమలవుతున్నదని ప్రశ్నించారు. మనకు తెలియకుండానే నూటికి 90 శాతం ప్రయివేటు పాఠశాలల్లో మనువాద భావజాలాన్ని విద్యార్థులకు జొప్పిస్తున్న పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా మెరుగైన విద్య అందించడం ఎలా సాధ్యం అవుతుందని పాలకులను నిలదీశారు. ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థలను కాపాడుకునేం దుకు జరుగుతున్న పోరాటాల్లో వ్యవసాయ కార్మిక సంఘం కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. బస్తీదవాఖానాల పేరుతో హడావిడి చేయడం మానేసి ప్రతి పీహెచ్సీలోనూ ముగ్గురు డాక్టర్లను పెట్టి 24 గంటలు పనిచేసేలా చేయాలని పాలకులను డిమాండ్ చేశారు. దేశంలో కొత్తవాటి పేరుతో ఉన్న హక్కులను కాలరాస్తున్న పరిస్థితి ఉందని చెప్పారు.