Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అజరుబాబు
- జీపు జాతా పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఈ నెల 7న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న రవాణా కార్మికుల సంఘర్ష యాత్రను జయప్రదం చేయాలని ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అజరుబాబు పిలుపునిచ్చారు. శనివారం ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయంలో జీపు జాతా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజరుబాబు మాట్లాడుతూ.. రవాణారంగం కార్మికులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం ఈ యాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు సాధన, మోటార్ వెహికల్ సవరణ చట్టం-2019 రద్దుతోపాటు ఆర్టీసీ పరిరక్షణ కోసం ఏఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్రస్థాయి జీపు జాతా నిర్వహిస్తుందని తెలిపారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మోటార్ వాహన చట్టం-2019ను సవరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డ్రైవర్లపై వేస్తున్న పెనాల్టీలు భరించలేని స్థాయిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్ లోడు పెనాల్టీ విపరీతంగా కార్మికుల ఆదాయాన్ని దోపిడీ చేస్తుందన్నారు. కేరళలో సవారీ యాప్ తరహా తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో అనేక చోట్ల వెహికల్ పార్కింగ్ పెద్ద సమస్య అవుతుందని, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు కార్మికులు అడిగినచోట పార్కింగ్ స్టాండ్‌కు స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనవరి 3వ తేదీన ఖమ్మంలో ప్రారంభమయ్యే సంఘర్ష యాత్ర(జీపు జాత) జనవరి ఏడో తేదీన హైదరాబాద్‌లోకి అడుగుపెడుతుందని, 7న నగరంలో కార్మికుల బైక్ ర్యాలీ ఉంటుందని, ఈ ర్యాలీలో అత్యధిక సంఖ్యలో డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లాబక్షు, ఉమేష్ రెడ్డి, కలీము సాబేరా, గౌస్, అహ్మద్ ఖాన్, కుమార్ స్వామి, కృష్ణ, మొయిన్, నబి నజీర్ తదితరులు పాల్గొన్నారు.