Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా మహేందర్‌రెడ్డికి వీడ్కొలు పలికిన ఐపీఎస్ అధికారులు
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) అంజనీకుమార్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. మధ్యాహ్నం 12.50 గంటలకు ఆయన.. రిటైర్ అవుతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి నుంచి బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు ఏసీబీ కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి వచ్చిన అంజనీకుమార్‌కు సీనియర్ ఐపీఎస్ అధికారులు స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు. లోపల అప్పటికే ఆయన కోసం వేచి ఉన్న మహేందర్‌రెడ్డి డీజీపీ చాంబర్లోకి అంజనీకుమార్‌ను సాదరంగా ఆహ్వానించి నేరుగా డీజీపీ సీటు వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అనంతరం అధికారిక ఫైలులో అంజనీకుమార్ డీజీపీగా సంతకం చేశారు. అనంతరం రిటైరైన డీజీపీ మహేందర్‌రెడ్డిని సుందరంగా అలంకరించిన వాహనంలో కూర్చొబెట్టి దానికి ఇరువైపులా కట్టిన తాళ్లను సీనియర్ ఐపీఎస్ అధికారులు లాగుతూ డీజీపీ కార్యాలయ ప్రాంగణం నుంచి మేయిన్ గేటు వరకు తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక వాహనం నుంచి దిగిన మహేందర్‌రెడ్డి తన కారులో కూర్చొని నివాసానికి బయలుదేరి వెళ్లారు. గత కొన్నేండ్లుగా రిటైరైన డీజీపీలను ప్రత్యేక వాహనంలో కూర్చోబెట్టి తాడుతో లాగుతు తీసుకెళ్లి మేయిన్ గేటు వద్ద వీడ్కోలు పలకటం ఆనవాయితీగా వస్తున్నది. ఈ మారు వాహనం తాడును లాగిన వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, సందీప్ శాండిల్య, సంజరు జైన్, శిఖాగోయల్, స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్ తదితర ఉన్నతాధికారులు ఉన్నారు. డీజీపీగా ఛార్జి తీసుకున్న తర్వాత తన చాంబర్లో వేద మంత్రాల మధ్య పూజలు చేసిన అంజనీకుమార్.. తర్వాత ముఖ్యమంత్రిని కలువడానికి వెళ్లారు. అంజనీకుమార్ డీజీపీగా బాధ్యతల ను స్వీకరిస్తున్న సమయంలో డీజీపీ కార్యాలయంలోని అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషర్లు, డీజీపీ కార్యాలయ అధికారులు అక్కడే ఉండి ఆయనకు శుభాకాంక్షలు తెలియ చేశారు.