Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
- హైదరాబాద్లో కాగడాల ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జనవరి మూడు నుంచి తొమ్మిది వరకు కేరళలోని త్రివేండ్రంలో జరగనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఐద్వా ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయం ఐలమ్మ భవనం నుంచి బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ వరకు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ మూడేండ్లకోసారి ఐద్వా చేసిన కృషిని సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి మహాసభలు జరుగుతాయని చెప్పారు.
ఈ మూడేండ్లలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని సంఘం పనిచేసిందన్నారు. సమాజంలో ఎక్కువమంది మొత్తం కోవిడ్-19 బారిన పడి అనేక అవస్థలు పడ్డారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ధరల పెరుగుదల, మహిళలపై పెరిగిన దాడులు వంటి అంశాలపై మహాసభల్లో చర్చిస్తామని వివరించారు. ఇంకోవైపు మోడీ ప్రభుత్వం దోషులకు అండగా నిలబడడం ప్రమాదకర సంకేతమని చెప్పారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ఐద్వా మహిళ పక్షాన, ప్రజలకు అండగా నిలబడి పోరాడిందని గుర్తు చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం, అధిక ధరలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశామన్నారు. మహిళలపై దాడులు జరిగిన సందర్భాల్లో బాధితుల పక్షాన నిలబడి పోరాడి విజయాలు సాధించామని అన్నారు. రాబోయే మూడేండ్ల కాలంలో స్త్రీలకు ఉపాధి కోసం ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా విద్యావైద్యం పేదలకు ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ కోసం చట్టాలను పటిష్టంగా అమలు జరపాలనీ, చట్టసభల్లో స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు కోసం తీర్మానాలు చేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాబోయే కాలంలో మహిళలు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవాలనీ, ఐద్వా చేపట్టే పోరాటాలు, పిలుపుల్లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి, ఉపాధ్యక్షులు కెఎన్ ఆశాలత, పి శశికళ, ఎమ్ వినోద, కె నాగలక్ష్మి, రాష్ట్ర నాయకులు ఎ పద్మ, ఎం లక్ష్మమ్మ, షబానా, ఎన్ పద్మ, సత్తెమ్మ, బి కవిత తదితరులు పాల్గొన్నారు.