Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, జనసేనల నుంచి వలసలు
- కేసీఆర్ సమక్షంలో నేడు చేరికలు
- గులాబీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ మంత్రి రావెల, విశ్రాంత ఐఆర్ఎస్ పార్థసారధి
- ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ?
- అధికారికంగా ప్రకటించనున్న గులాబీ బాస్
- త్వరలో విజయవాడలో కార్యాలయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన తర్వాత ఇప్పటి వరకూ ఎలాంటి హడావుడి లేకుండా స్తబ్దుగా ఉన్న ఆ పార్టీ... కొత్త ఏడాది తొలి రోజున ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. గతంలో ప్రకటించినట్టు పొరుగు రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలను ప్రారంభిస్తామంటూ చెప్పిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ ముందుగా పొరుగు రాష్ట్రం.. అందునా సోదర తెలుగు ప్రాంతం మీద కన్నేశారు. అక్కడి బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలను బీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించి.. సఫలీకృతులయ్యారు. ఏపీలో అడుగు పెట్టేందుకు వీలుగా కేసీఆర్ అక్కడ వివిధ పార్టీల్లో పనిచేసి.. స్థానికంగా పరిచయాలున్న నాయకులతో చర్చలు నిర్వహించి.. వారితో ఓకే అనిపించుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు సీనియర్ నేతలను ఆకర్షించగలిగారు. ముఖ్యంగా బీజేపీ, జనసేన నుంచి ముఖ్యులు కారెక్కేందుకు సిద్ధమయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్ (తెలంగాణ భవన్) వారి చేరికలకు వేదిక కానుంది. కేసీఆర్‌తో చర్చలు.. సమాలోచనలు.. రాబోయే ఎన్నికల్లో గెలుపోటములకు గల అవకాశాలపై లెక్కలేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తోట చంద్రశేఖర్.. తాను బీఆర్ఎస్లో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి పార్థసారధి కూడా ఆ పార్టీలో చేరబోతున్నారు.
గతంలో ఐఏఎస్‌గా పనిచేసిన తోట చంద్రశేఖర్ వీఆర్ఎస్ తీసుకుని సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి 2009లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ తరపున ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జనసేనలో చేరిన ఆయన 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసినా ఫలితం దక్కలేదు. ఆ క్రమంలో 2020 నుంచి జనసేనకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన...ఇప్పుడు బీఆర్ఎస్లో చేరబోతు న్నట్టు ప్రకటించారు.ఇక మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు విషయా నికొస్తే... ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన ఆ పదవికి రాజీనామా చేసి 2014లో టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి... చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. రెండున్నరేండ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆయన తన పదవి కోల్పోయారు. 2018లో రావెల జనసేనలో చేరారు. అంతకు ముందు గెలిచిన ప్రత్తిపాడు నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేసిన ఆయన... మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరినప్పటికీ ఆ పార్టీలో ఇమడలేక ఏడాది క్రితం దానికి గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న రావెల... ఇప్పుడు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోను న్నారు. మరోవైపు 2019లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన తరపున పోటీ చేసిన మాజీ ఐఆర్ఎస్ చింతల పార్థసారధి కూడా బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. ఎంపీగా ఓటమిని చవి చూసిన తర్వాత ఆయన బీజేపీలో చేరారు. అయితే ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరబోతున్నారు. ఏపీ నుంచి నేతల చేరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా త్వరలోనే విజయవాడలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఇప్పటికే నేతలను ఆదేశించారు. అతి త్వరలోనే అక్కడ ఆఫీసును ఏర్పాటు చేస్తామంటూ వారు చెబుతున్నారు. దీంతోపాటు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కూడా బీఆర్ఎస్ కార్యకలాపాలు మొదలయ్యాయి. అక్కడ ఆ పార్టీ అనుబంధ విద్యార్థి, యువజన విభాగాలను ఏర్పాటు చేసేందుకు కొందరు ముందుకొచ్చారు. ఏపీ స్టూడెంట్స్, యూత్ జేఏసీకి చెందిన రాయపాటి జగదీష్ ఈ మేరకు ప్రెస్‌మీట్ కూడా ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించటం గమనార్హం. మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశముంది. ఆ నిర్ణయాన్ని కేసీఆరే స్వయంగా ప్రకటిస్తారని తెలిసింది.