Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్తికునికి..నాస్తికునికి సమాన హక్కు
- లెఫ్టిస్టయినా..రైటిస్టయినా పుస్తకాలు చదవాలి.. చర్చించాలి
- పిల్లల్లో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి
- మార్పు అనివార్యం..స్వాగతించాలి
- మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైటిస్టు అయినా, లెఫిస్టు అయినా, ఇంకే భావజాలమున్నప్పటికీ మనుషులందర్నీ కలిపే గొప్పతనం పుస్తకానికి ఉందని మహారాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు చెప్పారు. ఆస్తికునికి, నాస్తికునికి ఈ దేశంలో సమాన హక్కు ఉందనీ, ఏ అంశంపైనైనా క్షుణ్ణంగా చదివి సహృదయ వాతావరణంలో చర్చ జరిపితే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని కళాభారతిలో జరుగుతున్న హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ముగింపుసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నిరంతర సాహిత్య చర్చల ద్వారా తాత్విక చింతనను, భారతి విజ్జానాన్ని, ఉపనిషత్తులను, ఇతిహాస గ్రంథాల విజ్ఞానాన్ని దర్శించవచ్చని అన్నారు. భాస్కరాచార్య గ్రంథాలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేశానన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సమతా స్ఫూర్తిని ప్రజలమధ్య నింపడానికి కృషిచేశారని పేర్కొన్నారు. పిల్లలందరిలోనూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేయించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ప్రాంగణానికి ఒగ్గుకథ కళాకారుడు మిద్దెరాములు, చర్చావేదికకు అలిశెట్టి ప్రభాకర్ పేర్లు పెట్టడం అన్నివిధాలా ఆమోదయోగ్యమన్నారు. ఈ బుక్ ఫెయిర్‌లో 80 ఏండ్లకు పైబడిన రచయితలు తమ పుస్తకాలను అమ్ముతుంటే కండ్లల్లో నీళ్లు తిరిగాయని చెప్పారు. ఈ వయస్సులోనూ పుస్తకాలు రాయడం, తమ భావాలను ప్రజలకు అందించాలనే తప్పన స్ఫూర్తిదాయకం అన్నారు. అలాంటి మార్పును స్వాగతించాలన్నారు. గత చరిత్ర నుంచి భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలన్నారు. గూగుల్‌లో మనకు తెలిసిన సమాచారాన్ని పొందుపర్చాలన్నారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ .. ఇంటర్ నెట్ వచ్చాక పిల్లల్లో వచ్చిన మార్పులు చూస్తుంటే ఆందోళన కలుగుతున్నదన్నారు. ఇలాంటి పుస్తక ప్రదర్శనలు వారి ప్రవర్తనల్లో మార్పు తెస్తాయని ఆకాంక్షించారు. తోటి మనుషులతో ఎలా మెలగాలి? వృద్ధులతో ఎలా వ్యవహరించాలి? పెద్దలను ఎలా గౌరవించాలి? అనే విలువలను నేర్పించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. హైదరాబాద్‌లోని వంద స్కూళ్లను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని పిల్లల్లో నైతిక విలువలు పెంచే విధంగా కృషి చేయాలన్నారు. తాము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఏ భావజాలంపైనైనా చర్చోపచర్చలు చేసేవాళ్లమన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రంథాలయాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాల్లోనూ బుక్‌ఫెయిర్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ..కరోనా తర్వాత ఇంత పెద్ద సంఖ్యలతో మనుషులు కలుసుకున్నది బహుషా బుక్ఫెయిర్లోనేనన్నారు. పుస్తకాలు మనుషుల్లో వివేకాన్ని పెంచుతాయన్నారు. గతంతో పోలిస్తే యువ పాఠకుల సంఖ్య పెరిగిందని చెప్పారు. కరోనా కాలంలో పదివేలకు పైగా మంది యువకవులు రచనలు చేశారనే విషయాన్ని పుస్తక ప్రదర్శన ద్వారా తెలుసుకున్నామన్నారు. పుస్తక ప్రియుల సంఖ్య పెరుగుతున్నదని బుక్‌ఫెయిర్ నిరూపించిందని తెలిపారు. తెలంగాణ గ్రంథాలయ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ.. పుస్తకం చదవడం వల్ల వికాసం పెరుగుతుందన్నారు. పుస్తకం అమ్మబువ్వతో సమానమని వ్యాఖ్యానించారు. ప్రతి ఇంట్లోనూ 50, 100 పుస్తకాలతోని చిన్న లైబ్రరీలను ఏర్పాటు చేసి పిల్లలతో చదివించాలన్నారు. బీసీ కమిషన్ చైర్మెన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. మన తెలంగాణ సాహిత్య పరిమళాలు నలుదిశలా తీసుకెళ్లేందుకు హైదరాబద్ పుస్తక ప్రదర్శన ఎంతో కృషిచేస్తోందన్నారు. గులాంగిరి నవల తనను ప్రభావితం చేసిందన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి మాట్లాడుతూ..జ్ఞాన సమాజాన్ని నిర్మించడంలో పుస్తకానిది కీలక పాత్ర అన్నారు. ఈ సభలో రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మెన్ రావుల శ్రీధర్ రెడ్డి, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మెన్ సోమా భరత్ కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ అంగ్ల విభాగ అచార్యులు కొండా నాగేశ్వర్, బుక్ ఫెయిర్ కోశాధికారి రాజేశ్వర్‌రావు, కార్యదర్శి శతికాంత్ భారతి, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షలు కోయా చంద్ర మోహన్, నారాయణ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వాసు, తదితరలు పాల్గొన్నారు.