Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశం నలుమూలల నుంచి పాల్గొని ఆస్వాదించండి
- నుమాయిష్ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నుమాయిష్ ప్రపంచ వ్యాపార సమ్మేళనాల్లో ఒకటని ఎగ్జిభిషన్ సొసైటీ గౌరవాధ్యక్షులు, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. దేశ నలమూల నుంచి పాల్గొని నుమాయిష్‌ను ఆస్వాదించాలని కోరారు. దీనికి ఇంత పేరు తెచ్చేందుకు ఎంతో మంది కృషి చేశారని గుర్తు చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఉమ్మడిగా తెలంగాణ వ్యాప్తంగా 19 విద్యాసంస్థలకు నిధులు సమకూరుస్తున్నదన్నారు. సుమారు 30,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదని తెలిపారు. ప్రత్యేకంగా మహిళా విద్యను ప్రోత్సహించేందుకు విద్యాసంస్థలు నడుపుతున్నదని వివరించారు. 1938 లో ప్రారంభించిన నుమాయిష్ దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న 82వ ఎగ్జిభిషన్‌ను మంత్రి ప్రారంభించారు. రైలు బండిపై తిరిగి అన్ని స్టాళ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ల్లోనే కాకుండా కుల్కచర్ల, పరిగి, నిర్మల్ వంటి దూర ప్రాంతాల్లోనూ విద్యాసంస్థలు ప్రారంభించిందని తెలిపారు. అందులో సుమారు 2,000 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. దీని ద్వారా ప్రతి ఏటా దాదాపు 10వేల మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధి పొందుతున్నారని అన్నారు. నుమాయిష్ ఇంత ఇమేజ్ సంపాదించడం సామాన్యమైన విషయంకాదన్నారు. తద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజి పెరుగుతున్నదని వివరించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుదిక్కుల నుంచి అన్ని రాష్ట్రాల వ్యాపారాలు ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. సాధారణ ప్రజల మద్ధతుతో నుమాయిష్ ఇంతటి ఉదాత్తమైన స్థానానికి చేరుకుందన్నారు. సొసైటీ కార్యవర్గం అంకితభావంతో పని చేయడం ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. వ్యాపారం, వినోదం అందించడంతోపాటు ఎగ్జిబిషన్ సోసైటీ మానవత్వంతో మంచి కార్యక్రమాలు చేపడుతుందని అభినందించారు. వివిధ రాష్ట్రాలు తిరగాలనీ, అక్కడి సంస్కృతులను, ఆహారాన్ని రుచి చూడాలని అనుకునే వాళ్లకు నుమాయిష్ మంచి వేదిక అన్నారు. కోవిడ్ సమయంలో తమ ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చి ఆదుకుందని తెలిపారు. వివిధ రకాల సంప్రదాయ ఉత్పత్తుల స్టాళ్లతో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను మినీ భారత దేశంగా మార్చారని చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్టాల్స్ నిర్వహకుల ఆరోగ్యం పట్ల ఎగ్జిబిషన్ సొసైటీ దృష్టి సారించాలని కోరారు. వారంతా మన రాష్ట్రానికి వచ్చిన అతిథులనీ, వారికి అవసరమైన ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. పోలీసు, మున్సిపల్, జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్... తదితర విభాగాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.