Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో నాలుగు రాష్ట్రాల్లో అధికారుల బృందం పర్యటన
- ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అర్థ గణాంక, ప్రణాళిక శాఖలను క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కార్యాచరణను అమలు చేస్తామని అన్నారు. అందులో భాగంగా పలు అంశాలపై అధ్యయనానికి త్వరలో నాలుగు రాష్ట్రాల్లో అధికారుల బృందం పర్యటిస్తుందని వివరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో అర్థ గణాంక శాఖ డైరెక్టర్ జి దయానంద్ నేతృత్వంలో రాష్ట్ర అధికారుల బృందం, జిల్లా ప్రణాళిక అధికారులు వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ చేసిన సూచనలపై వినోద్ కుమార్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో అర్థ గణాంక, ప్రణాళిక శాఖలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయనీ, వాటిని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందంటూ సీఎం అభిప్రాయపడ్డారని చెప్పారు. మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి ఏటా అర్థ గణాంక శాఖ డైరెక్టర్ కార్యాలయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు, ఇతర గణాంకాలతో కూడిన అనేక ప్రచురణలు వెలువరిస్తున్నట్టు డైరెక్టర్ జి దయానంద్ వివరించారు. పలు అంశాలపై అధ్యయనం చేసేందుకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటించాల్సిన అవసరముందంటూ వినోద్‌కుమార్ దృష్టికి ఆయన తెచ్చారు. అందుకు సంబంధించిన అంశాలపై కార్యాచరణను సిద్ధం చేయాలంటూ అధికారులను వినోద్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో గణాంక శాఖ అధికారులు డి శివకుమార్, కస్తూరి వెంకట్, బి వేణుమాధవ్, ఆర్ నరసింహ చారి, హరికృష్ణ, బాబురావు, వెంకటేశ్వర్లు, అశోక్, వెంకటరమణ, మాన్య తదితరులు పాల్గొన్నారు.