Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళిసై ఆకాంక్ష
- రాజ్‌భవన్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన సంవత్సరమైన 2023 దేశ ప్రజలందరికి ఆరోగ్యం, భద్రత ఇచ్చేదిగా ఉండాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఆకాంక్షించారు. గతేడాది దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ నిర్వహించడంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలిగామని ఆమె తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చి తమిళిసైని కలిశారు. ఆమెకు పూలబొకేలు, శాలువాలు, పుస్తకాలు, క్యాలెండర్లు, డైరీలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్ అక్కడి దర్భార్ హాలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హ్యాండ్ లూం స్టాల్స్‌ను సందర్శించారు. చీరలు, చేతితో నేసిన ఉత్పత్తులను శ్రద్ధతో తిలకించారు. ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్, జీ-20 కోసం ప్రత్యేక డిజైన్లతో ముందుకొచ్చిన నేతన్నలను అభినందించారు. రాజ్ భవన్ ను సందర్శించిన వారిలో ప్రత్యేక ప్రతిభావంతులైన దంపతులున్నారు. అక్కడకు వచ్చిన వారిలో, ముఖ్యంగా మహిళలు తమ సమస్యలతో వినతిపత్రాలను సమర్పించారు. రెండు గంటలకు పైగా గవర్నర్ వచ్చిన వారి నుంచి శుభాకాంక్షలు స్వీకరిస్తూ గడిపారు. అంతకు ముందు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.