Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంజీబీఎస్‌లో టీఎస్ఆర్టీసీ ఎమ్డీ నూతన సంవత్సర వేడుకలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
త్వరలోనే ఆర్టీసీలోని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. ప్రయాణికులు, సిబ్బంది సంక్షేమానికి ఈ ఏడాది మరింత ప్రాధాన్యం ఇస్తామన్నారు. 2023 సంవత్సరాన్ని ప్రయాణీకుల సంక్షేమానికి అంకితం చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రయాణీకులు, ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆర్టీసీలో పని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. 2022లో సంస్థను ప్రయాణీకులు బాగా ఆదరించారనీ, రాఖీ పౌర్ణమి నాడు దాదాపు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి, రికార్డు స్థాయిలో ఒక్కరోజే రూ.20 కోట్ల ఆదాయాన్ని అందించారని గుర్తు చేశారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రయాణీకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామనీ, లెటర్స్, ట్విట్టర్ ద్వారా వాటిని అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఏండ్ల తరబడి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆయన సన్మానించారు. అలాగే ప్రయాణీకులు పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్లను రికవరీ చేసిన హెడ్ కానిస్టేబుల్ బాబురావును కూడా ఆయన సన్మానించారు. సుధాకర్ అనే ప్రయాణికుడు ఎర్ర బస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు వరకు ఆర్టీసీ అభివద్ధి చెందిన క్రమాన్ని వివరించారు. ఆర్టీసీ బస్సులో కుల, మత, వర్గ, లింగ బేధాలకు తావు లేదన్నారు. అందరినీ సమానంగా చూసేది ఆర్టీసీ బస్సు ఒక్కటేనని మెచ్చుకున్నారు. కార్యక్రమంలో సీవోవో డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం, హైదరాబాద్, రంగారెడ్డి ఆర్ఎంలు రాజేంద్రప్రసాద్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.