Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమయం.. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తా...
- ప్రజాహితమే నా అభిమతం.. తప్పకుండా వారి కోరిక నెరవేరుస్తా
- న్యూఇయర్ వేడుకల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు శీనన్న టీం సిద్ధంగా ఉందని.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని.. ప్రజాహితమే తన అభిమతంగా భావించే తానూ.. తప్పకుండా వారి కోరిక నెరవేరుస్తానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన నూతన సంవత్సర వేడుకలకు ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది ఆయన అనుచరులు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన నాలుగున్నరేండ్లలో ఏం జరిగింది, ఎందుకు జరిగిందనేది మనందరికీ తెలియంది కాదన్నారు. ఈనాడు మనంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని, ఈ పార్టీలో మనకు జరిగిన గౌరవం ఏంటి...? భవిష్యత్తులో ఉండబోయే గౌరవం ఏంటనేది ఒక్కసారి మనంతా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వేదిక మీద ఉన్న వివిధ నియోజకవర్గాల ముఖ్య నాయకులందరూ కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీచేసి తీరుతారని స్పష్టం చేశారు. ప్రజల ప్రేమ, అభిమానాలు పొందిన, పొందుతున్న ప్రతి నాయకుడూ ప్రజాప్రతినిధి కావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అలా అయినప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందని, న్యాయం జరిగి ప్రజాహిత పరిపాలన అందుతుందన్నారు. ఇది రాజకీయ వేదిక కాదని, సమయం.. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు మీతో చర్చిస్తానని చెప్పారు. తప్పకుండా మీ దీవెనలతో.. మీ ఆశీర్వాదంతో.. మీరు ఏదైతే కోరుకుంటున్నారో.. కోరుకునేది తప్పకుండా చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నానంటూ ప్రసంగాన్ని ముగించారు.