Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతోషంలో సర్పంచులు... ఆదాయంలో పంచాయతీలు
- ఆర్గానిక్ వ్యవసాయం వైపు పల్లె ప్రగతి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అమలవుతున్న ప్రతిష్టాత్మక పథకాల్లో పల్లె ప్రగతి ప్రత్యేకమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలన్న జాతిపిత గాంధీజి స్పూర్తితో సిఎం కేసిఆర్ పల్లెలను పటిష్టం చేసేందుకు ప్రారంభించిన పథకం పల్లె ప్రగతి కార్యక్రమమని స్పష్టం చేశారు. పల్లెలను స్వయం సమృద్ధిగా తయారు చేయడం, పల్లెల్లో పరిశుభ్రత పాటించడం, పచ్చదనం పెంపొదించడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలుగా 2015లో దీనిని ప్రారంభించగా... ఆ ఆశయాలు నేడు ఆచరణగా మారిందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయంలో ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం, ముఖరాకే గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించిన తీరును మంత్రికి వివరించారు. తమ గ్రామంలో తయారు చేసిన వర్మి కంపోస్ట్ ను సర్పంచ్ దంపతులు మంత్రికి బహుకరించారు. పల్లె ప్రగతి విజయవంతంగా అమలు చేసి స్వయం సమృద్ధి గ్రామంగా అభివృద్ధి చెందుతున్నదని వివరించారు. పల్లె ప్రగతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన ట్రాక్టర్, అమలు చేస్తున్న తడి, పొడి చెత్త విధానం, డంపింగ్ యార్డు నిర్వహణ, కంపోస్ట్ ఎరువు తయారి గ్రామానికి ఆదాయ మార్గంగా మారాయని తెలిపారు. ఏడాదిన్నర కాలంలో పల్లె ప్రగతి వర్మి కంపోస్ట్ తయారి ద్వారా ఏడు లక్షల రూపాయల ఆదాయం సంపాదించారని పేర్కొన్నారు. ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరించడం, తడి, పొడిచెత్తగా వేరు చేయడం, దానిని వర్మి కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా ఈ గ్రామ సర్పంచ్ గాడిగె మీనాక్షి విజయవంతం అయ్యారని మంత్రి చెప్పారు. సంపాదనలో వచ్చిన డబ్బుతో నాలుగు లక్షలు ఖర్చు చేసి సోలార్ లైట్లు ఏర్పాటు చేసి, రెండు లక్షలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారన్నారు. ఆర్గానిక్ కంపోస్ట్ తయారు చేయడమే కాకుండా దానిద్వారా వచ్చే లాభాలను రైతులకు వివరించడం ద్వారా 100మంది రైతులు ఆ గ్రామంలో ఆర్గానికి పంటలు పండిస్తున్నట్టు తెలిపారు. ముఖరాకే గ్రామ సర్పంచ్‌ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఇందుకు సహకరించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు.. ఆర్గానిక్ వ్యవసాయం చేయడం వల్ల మట్టికి, మనుషులకు మేలు జరుగుతందన్నారు. రసాయనాలను నివారించడం వల్ల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు.