Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుస్తకావిష్కరణలో జూలూరు గౌరి శంకర్, పాశం యాదగిరి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎర్రజెండానే ప్రజల గొంతుక అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరిశంకర్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నిరంతం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని గుర్తు చేశారు. పేద ప్రజలపక్షాన 45 ఏండ్లుగా ఎర్రజెండా పట్టుకుని ముందుకు సాగుతున్నారని చెప్పారు. అనేక ప్రజాసమస్యలను అసెంబ్లీ వేదికగా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పుడు నిశ్శబ్దం చాలా ప్రమాదకస్థాయిలో ఉందనీ, ఈ నేపథ్యంలో ప్రశ్నించడం రావాలన్నారు. నిశబ్దం చాల ప్రమాదకరమన్నారు. ప్రజల్లో నుంచి ఒక గాంధీ, ఒక భగత్‌సింగ్ రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ 35వ బుక్ఫెయిర్లో సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రచించిన 'ప్రజల గొంతుక' రాజకీయ సామాజిక వ్యాసాలు-అసెంబ్లీ ప్రసంగాలు అనే పుస్తకాన్ని నవతెలంగాణ జనరల్ మేనేజర్ వాసు, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ డైరెక్టర్ రాజేందర్‌రెడ్డితో కలిసి జూలూరు అవిష్కరించారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రజల గురించి మాట్లడకపోతే పెట్టుబడిదారుల రాజ్యం వస్తుందనీ, ఇది సమాజానికి అత్యంత ప్రమాదకరమని చెప్పారు. కవి యాకుబ్ మాట్లడుతూ మనం స్వేచ్చగా ఉన్నామంటే ఎర్రజెండ పోరాటాల ఫలితమేనన్నారు. రచయిత జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ తాను మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి అనేక ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యమైన విషయాన్ని పుస్తకంలో పొందుపరిచినట్టు తెలిపారు. ప్రజాసమస్యలను అటు అసెంబ్లీలోనూ ఇటు ఉద్యమాల్లోను ప్రజాసమస్యలను ప్రస్తావించి, పరిష్కరించిన అంశాలను పుస్తకంలో రాసినట్టు తెలిపారు. పాలక వర్గాలు బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నప్పటికీ వాటిని సరైన పద్దతుల్లో ఖర్చు చేయని వైనాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారించాలని కోరామన్నారు. తాను అసెంబ్లీలో గంటల తరబడి మాట్లాడిన మాటలను తన ప్రజల గొంతుగా పుస్తకంలో పేర్కొన్నట్టు తెలిపారు.