Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6 రోజుల్లో రూ.1,111.29 కోట్ల మద్యం అమ్మకాలు
- 'మత్తు'తో కొత్త ఏడాదికి స్వాగతం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా యువతరం మద్యం తాగడాన్ని ఫ్యాషన్‌గా భావిస్తుండటంతో 'కిక్కు' లేకుండా ఏ కార్యం జరగట్లేదు. దుఖానికీ, సంతోషానికీ, బంధాలకు మద్యం వారధిగా నిలుస్తూ, మత్తుతో యువతరాన్ని నిద్రపుచ్చి, శక్తిని నిర్వీర్యం చేస్తున్నది. ప్రభుత్వాలు మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా చూస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. కేవలం ఆరు రోజుల్లో రాష్ట్రంలో 1,111.29 కోట్ల విలువైన మద్యాన్ని రికార్డు స్థాయిలో తాగేశారు. ఆదివారం రోజు జనవరి 1 రావడంతో గ్రామ దేవత ఆలయాల వద్ద 'వేటలు' తెగిపడ్డాయి. సెంటిమెంటును సంతోషంతో నింపేందుకు మద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రిని యువతరం మద్యంతో సెలబ్రేట్ చేసుకుంది. అమ్మకాలు భారీగా పెరగడంతో ఆబ్కారీ శాఖ వార్షిక ఆదాయ లక్ష్యాలకు చేరువైంది. డిసెంబరు 30న అత్యధికంగా రూ.254 కోట్లు, 31న రూ.216 కోట్లు విలువైన మద్యం అమ్ముడైనట్టు ఆబ్కారీ శాఖ తెలిపింది.
గత ఏడాది (2021) డిసెంబరు 31వ తేదీన రూ.171.93 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది అంతకుమించి (రూ.216 కోట్లు) రూ.44 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్టు ఆబ్కారీ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. నూతన సంవత్సర వేడులక సందర్భంగా మద్యం విక్రయ వేళలను ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అదేరోజు రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఇవన్నీ మద్యం విక్రయాలు పెరిగి, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేందుకు ఉపయోగపడ్డాయి.