Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్
- 11 రోజుల పాటూ ఇసుకేస్తే రాలనంత పుస్తక ప్రియుల రాక
- 10 లక్షల మందికిపైగా సందర్శన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎటు చూసినా జనసంద్రమే. పుస్తక ప్రియుల కోలాహమే. కనిపించిన దానల్లా కోనియ్యాలనే చిన్నపిల్లల అలకలు. తల్లిదండ్రుల బుజ్జగింపులు. వారి ఆసక్తి కాదనలేక సరే అని కానిచ్చేయడం. ఆ బాంఢాగారంలో అడుగుపెట్టాక ఒక పుస్తకం కొందామని వచ్చినోళ్లు పదిదాకా కొని పట్టుకుపోవడం. సాహిత్య చర్చలు, రచయితలు, కవులతో ముఖాముఖిలు, పుస్తకావిష్కరణలు, మేధావుల సందేశాలు, రాజకీయ ప్రముఖుల సందర్శనలతో హైదరాబాద్ బుక్‌ఫెయిర్ విజయవంతంగా ముగిసింది. ఇసుకేస్తే రాలనంత పుస్తక ప్రియులతో 11 రోజుల పాటు జనజాతర సాగింది. పుస్తకాలాయానికి కారులు బారులు తీరాయి. ద్విచక్రవాహనాలతో ఎన్టీఆర్ స్టేడియం నిండిపోయింది. అసలు ఎన్టీఆర్ స్టేడియం ఇంత చిన్నదైనదా? భవిష్యత్‌లో ఈ గ్రౌండ్ సరిపోదేమో? అనిపించింది. పుస్తకాలయాన్ని రోజుకు లక్ష మంది దాకా సందర్శించడం గొప్ప పరిణామం. డిజిటలైజేషన్ కాలంలో పుస్తకాలకు మనుగడ ఎక్కడ అనే ప్రచారాన్ని ఈ పుస్తక ప్రదర్శన పటాపంచలు చేసింది. కరోనా అనంతర కాలంలో ఏకకాలంలో ఇంత మంది పోగేసింది బహుషా ఈ పుస్తక ఫెయిరేనేమో అనిపించింది. 11 రోజుల వ్యవధిలోనే పది లక్షల మందిదాకా బుక్‌ఫెయిర్ సందర్శించటం మామూలు విషయం కాదు. 342కిపైగా స్టాళ్లతో ఏర్పాటు చేసిన మిద్దె రాములు ప్రాంగణం ఆది, శని, ఇతర సెలవు దినాల్లో ఇసుకేస్తే రాలనంతగా జనసంద్రమైంది. రాజకీయ వేత్తలు, బ్యూరోక్రాట్లు, ప్రముఖ విద్యావేత్తలు, మేధావులు, రచయితలు సామాన్యులుగా వచ్చి తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. అన్ని స్టాళ్లనూ కలియదిరిగారు. యువ రచయితలను ప్రోత్సహించారు. తమకు నచ్చిన పుస్తకం ఎక్కడా దొరుకుతుందా? అని పట్టువదలని విక్రమార్కుల్లా పుస్తక ప్రియులు బుక్ఫెయిర్నంతా శోధించారు. అలిశెట్టిప్రభాకర్ వేదిక ఎందరో రచయితల పుస్తకావిష్కరణకు, సాహితీ కార్యక్రమాలకు, ముఖాముఖిలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 'మరణం నా చివరి చరణం కాదు..సమరమే నా అంతిమ చిరునామా' అనే అలిశెట్టి ప్రభాకర్ కవిత, అతని ఫొటోతో పెట్టిన ఫ్లెక్సీ పుస్తక ప్రియుల సెల్ఫీస్పాట్‌గా మారింది. తమకు నచ్చిన పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయా? అని పుస్తక భాండాగారాన్ని యువత శోధించిన పరిస్థితి కనిపించింది. కాల్పనిక, ఆధునిక, విప్లవ సాహిత్యాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, చిన్నపిల్లల బొమ్మల పుస్తకాలు మొదలుకొని ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారికి అవసరమయ్యే పుస్తకాలు..ఇలా దొరకని పుస్తకమంటూ ఆ విజ్ఞాన బాంఢాగారంలో లేదు. ఏదో అలా చూసోద్దామని వెళ్లినవారు కూడా పుస్తకాల బ్యాగ్‌లతో వెనక్కి రావడం కనిపించింది. కొందరైతే వేలాది రూపాయలు వెచ్చించి తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. చాలా మంది కుటుంబంతో అక్కడకు రావడం, అలిశెట్టి వేదిక వెనక, పక్కనున్న ఖాళీ స్థలంలో కూర్చోని కాసేపు పిల్లలకు పుస్తక ప్రపంచం గురించి వివరించడం కనిపించింది. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిస్టాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చరఖాలను(నూలు వడికే రాట్నాలు) చిన్నపిల్లలు ఆసక్తిగా తిప్పారు. వాటి వెనుక చరిత్రను, గాంధీ గొప్పదనాన్ని తెలుసుకున్నారు. ఆ పుస్తకశాల భిన్న వైరుధ్యాలనున్న వారిని ఒకే వేదిక పంచుకునేలా చేసింది. అక్షరం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. అంబేద్కర్, ఫూలే, మార్క్సిస్టు భావజాలం ఉన్న పుస్తకాలు ఎక్కువ అమ్ముడుపోయినట్టు పలు స్టాళ్ల నిర్వాహకులు తెలిపారు. పుస్తకప్రియులు రోజురోజుకీ పెరుగుతుండటం శుభపరిణామం. అందర్నీ ఏకం చేస్తూ మెరుగైన సమాజం నిర్మాణం దిశగా అడుగులు వేసేలా చేయడంలో ఈ పుస్తక ప్రపంచం ఉపయోగపడుతుందనే దాంట్లో అతిశయోక్తి లేదు. ఇంట్లో శుభకార్యాలకు వెళ్లేటప్పుడు, ఇతరులకు ఆహ్వానం పలికేటప్పుడు ఇచ్చే బొకేలు, గిప్టుల స్థానంలో పుస్తకాలు ఇచ్చే రోజులు కూడా రాబోతున్నట్టు కనిపిస్తున్నది.