Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు స్టేషన్లకు కాంగ్రెస్ నాయకుల తరలింపు
- దిష్టిబొమ్మలు దహనం
గ్రామపంచాయతీల నిధుల మళ్లింపుకు నిరసనగా.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్‌లు సోమవారం చేపట్టిన చలో ఇందిరాపార్కు ధర్నాకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అదేవిధంగా, వారికి మద్దతుగా ధర్నాకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో పలుచోట్ల తోపులాట జరిగింది. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
నవతెలంగాణ- విలేకరులు
వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల, జూలపల్లి, రామగిరి ఎలిగేడ్, మంథని, సిరిసిల్ల జిల్లా కొనరావుపేట, కరీంనగర్ జిల్లాలోని గంగాధర, హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
సర్పంచుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలని వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. పెబ్బేరు నుంచి ధర్నాకు వెళుతున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇందుకు నిరసనగా నేతలు స్టేషన్లో బైటాయించారు. శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ రాములు యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
గ్రామపంచాయతీల నిధుల సమస్యపై కాంగ్రెస్ ఇందిరాపార్కు వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నాకు తరలివెళ్లకుండా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌లో జిల్లా కేంద్రంలో పోలీసుల తీరును నిరసిస్తూ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని దహనం చేసే యత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల తీరును ఖండిస్తూ నాయకులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కాగజ్‌నగర్‌లో ధర్నాకు వెళ్లకుండా కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టులను నిరసిస్తూ ఉట్నూర్ మండల కేంద్రంలో టీపీసీసీ కార్యదర్శి వెడ్మ బొజ్జు ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రామకృష్ణాపూర్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సర్పంచుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన ధర్నాకు యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండల సర్పంచులు వెళ్తుండగా అరెస్టు చేశారు. అనంతరం విడుదలైన వారు ఇందిరాపార్కు వద్ద ధర్నాకు తరలివెళ్లారు. నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ సెంటర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పెద్దవూర, తిరుమలగిరిసాగర్, చిట్యాల మండల సర్పంచులను ముందస్తుగా అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, సూర్యాపేట మండలాలకు చెందిన సర్పంచులను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కార్పొరేటర్ విజయారెడ్డిని బంజారాహిల్స్‌లో అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. అక్కడ ఆమె నిరసన తెలిపారు. తనతో ఇన్స్పెక్టర్ దురుసుగా మాట్లాడారని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ సి.రోహిన్ రెడ్డిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. కొత్తపేటలోని అల్కపురికాలనీలో దేప భాస్కర్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు.
జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో ములుగు-పరకాల ప్రధాన రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో దహనం చేశారు.