Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మకూరులో ఆర్టీఐ చట్టానికి తూట్లు
- సరైన సమాచారం కోసం ఎంపీవో కాళ్లు మొక్కిన మాజీ ఎంపీటీసీ
- ఎంపీఓ తీరుతో అసహనానికి గురవుతున్న సర్పంచ్‌లు
నవతెలంగాణ-ఆత్మకూర్
సామాన్య ప్రజలకు సాధికారత కనిపించేందుకు తీసుకువచ్చిన విప్లవాత్మక చట్టాల్లో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) 2005 ఒకటి. ప్రజలకు సమాచార సేకరణలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆర్టీఐ చట్టానికి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల ఎంపీఓ తూట్లు పొడుస్తున్నారని ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచులు ఆరోపిస్తున్నారు. ఆత్మకూరు గ్రామపంచాయతీ సర్పంచ్ పర్వతగిరి రాజు పెద్దాపూర్, అక్కంపేటతో పాటు పలు గ్రామ పంచాయతీలకు సంబంధించిన వీధిలైట్లు కొనుగోలు చేయడానికి గ్రామ పంచాయతీలో టెండర్లు ఎన్నిసార్లు చేశారో ఆ టెండర్ కాపీలు జిరాక్స్ ఇవ్వాలని గ్రామ కార్యదర్శిని కోరారు. వాటితో పాటు గ్రామ పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ రూపాల్లో వచ్చిన నిధుల వివరాలు, గ్రామపంచాయతీలో ఏయే పథకాల కింద ఎన్ని నిధులు వచ్చాయి, ఎంత వ్యయం చేశారో తెలిపే వివరాలు కోరారు. అలాగే, గ్రామాల్లో వీధుల్లో పోసిన చిప్స్ మొరం, కాపిటల్ పనులు రూ.50వేలు దాటితే టెండర్ విధానాన్ని ఎన్నిసార్లు అమలు చేశారో జిరాక్స్ కాపీలు ఇవ్వాలని 2022 నవంబర్ 17న ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులను ఆర్టీఐ ద్వారా కోరారు. ఇందుకు జనవరి 2న సోమవారం రైతు వేదిక పేపర్లు, ఇంటి, నల్ల పన్నులు, ఇంటి పర్మిషన్ పేపర్లు, ఉపాధి హామీ వివరాలను పంచాయతీ కార్యదర్శి అందించారని మాజీ సర్పంచ్ రాజు తెలిపారు. ఈ విషయంపై ఇదేమి సమాచారమని పంచాయతీ కార్యదర్శులను అడుగగా.. ఎంపీఓ చేతన్‌రెడ్డి ఇవ్వమని చెప్పిందే ఇచ్చామని కార్యదర్శులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని పర్వతగిరి రాజు తెలిపారు. సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 'ఇదేంటి సార్ అని అడగగా దాటవేసే సమాధానాలు చెప్పడంతో అసహనానికి గురైన సర్పంచ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు సమాచారం ఇవ్వండి మహాప్రభో అని ఎంపీఓ చేతన్‌రెడ్డి, ఎంపీడీవో కాళ్లపై పడి మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ ఎంపీఓ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అధికారులపై కోర్టులో ఫిర్యాదు చేస్తా : పర్వతగిరి రాజు, సర్పంచ్ల ఫోరం జిల్లా నాయకులు
గ్రామ పంచాయతీలో జరిగిన పనులపై సమాచారం ఇవ్వాలని ఆర్టీఏ ద్వారా కోరగా.. మరో సమాచారం ఇచ్చారని, ఇదేమిటని ప్రశ్నిస్తే ఎంపీఓ ఇవ్వమన్న సమాచారమే ఇచ్చాం, మాదేముంది అంటూ పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. కార్యదర్శులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఆర్టీఐ సమాచారం నాకు 2,3 రోజులు ఇవ్వకుంటే సంబంధిత అధికారులపై కోర్టులో ఫిర్యాదు చేస్తాను.
ఆర్టీఐ ద్వారా అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే : శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో
ఫిర్యాదుదారులు ఆర్టీఐ ద్వారా అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే. ఒక వివరణ కోరగా సంబంధంలేని మరో వివరణ ఇచ్చారని పర్వతగిరి రాజు తెలిపారని, త్వరలో అడిగిన పూర్తి సమాచారం ఇస్తాం.