Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖ ఉక్కును ఆయన అమ్మితే.. మేం ప్రభుత్వపరం చేస్తాం...
- బీఆర్ఎస్లో ఏపీ నేతల చేరికల సందర్భంగా సీఎం కేసీఆర్
- ఆ రాష్ట్రంలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యలు
- సంక్రాంతి తర్వాత చాలా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యాచరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అటు కేంద్రంలోని బీజేపీకి.. ఇటు ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరికలు జారీ చేశారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ద్వారా ఆయా పార్టీలపైన, వాటి విధానాలపైనా పోరాడతామనే సంకేతాలను ఇచ్చారు. తద్వారా దేశ రాజకీయాలను, మేధావుల దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు. సోదర తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం (తెలంగాణభవన్)లో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి, కాపునాడు జాతీయ అధ్యక్షుడు తాడిపాక రమేశ్‌నాయుడు, కాపునాడు కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు, అనంతపురం జిల్లాకు చెందిన నాయకుడు టీజే ప్రకాశ్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు.ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ...
కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టారు. అధికారంలోకి రావడమే బీఆర్ఎస్ లక్ష్యం కాదనీ, భారతదేశ పురోగమనాన్ని మార్చడమే తమ అసలు సిసలు లక్ష్యమని తెలిపారు. కొన్ని పార్టీల నేతలు ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో చెప్పి పబ్బం గడిపేస్తున్నారని విమర్శించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం మతపిచ్చిని సృష్టిస్తే దేశం ఏమైపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మతవిద్వేషాల వల్ల హత్యాకాండ జరిగితే దేశం, ప్రజలు ఏమైపోవాలి? అని ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా అంటూ కొన్ని పార్టీల నేతలు గొంతు చించుకుంటున్నారంటూ బీజేపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువుల నుంచి కరోనా కాలంలో వైద్యులు వేసుకునే కిట్ల వరకు చైనా నుంచే మనకు వస్తున్నాయని గుర్తు చేశారు. దేశంలో వీధివీధికీ ఒక చైనా బజార్లు ఏర్పడ్డాయని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా అనేది నిజమైతే ఇన్ని చైనా బజార్లు ఎందుకు పుట్టుకొచ్చాయని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయాలు అంటే ఒక కార్యాచరణ.. కానీ కొందరు దాన్ని ఆటగా మార్చారంటూ కేసీఆర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ఉజ్వలంగా తయారు చేయటంలో ఏపీ ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్గా విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నామనీ, ఆ ప్లాంటును మోదీ అమ్మితే.. తాము మళ్లీ ప్రభుత్వ రంగంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు సంక్రాంతి తర్వాత చాలా రాష్ట్రాల్లో తమ పార్టీ కార్యాచరణను ప్రారంభిస ా్తమనీ, బీఆర్ఎస్ను ఉరుకులు పరుగులు పెట్టిస్తామని వ్యాఖ్యానించా రు. తమ పార్టీలో చేరిన ఎవరికైనా స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన గౌరవాన్ని ఇస్తామని తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన పలు సరిహద్దు గ్రామాల ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ కోరుతున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలో వేల మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే సాధ్యమన్న కేసీఆర్...ఆయా ప్రాంతాలతోపాటు దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యాచరణను చేపడతామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని అన్ని రంగాల్లో దివాళా తీయించారని విమర్శించారు. విద్యుత్, సాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో మనకున్న వనరులు, వాటి పరిస్థితి, వాటిని ఉపయోగించుకోలేని వైనాన్ని ఆయన ఈ సందర్భంగా సోదాహరణంగా వివరించారు. బీఆర్ఎస్కు అధికారమిస్తే రెండేండ్లలో వెలుగుజిలుగుల భారత్‌ను నిర్మిస్తామని చెప్పారు. దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అసాధ్యమేమీ కాదనీ, రూ.1.45 లక్షల కోట్లతో ఆ పని చేయొచ్చని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశం మొత్తం దళితబంధు అమలు చేస్తామని హామీనిచ్చారు. ఆ క్రమంలో ఏటా 25 లక్షల మందికి చొప్పున ఆ పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ వివరించారు.
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియామకం...
ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని కేసీఆర్ ప్రకటించారు. ఢిల్లీ కేంద్రంగా రావెల కిశోర్‌బాబు బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. ఏపీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎం వెల్లడించారు.