Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల నుంచి తప్పించుకొని రోడ్డుపై విద్యార్థుల ధర్నా
నవతెలంగాణ-కాటారం
జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థులు వ్యాయాయం చేస్తున్న సమయంలో పాఠశాల నుంచి తప్పించుకొని వచ్చి హైవే-353సీ రోడ్డుపై గారెపల్లిలో ధర్నా నిర్వహించి ఆందోళన చేశారు. తమను ప్రిన్సిపాల్ చైతన్య వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పాఠశాల నుంచి చైతన్యను బదిలీ చేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. తమకు ఆరోగ్యం సరిగ్గా లేకున్నా ఇంటికి పంపించడం లేదని వాపోయారు. బాత్రూమ్, పాఠశాల గదులను తమతో కడిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే పట్టించుకునే నాధుడే లేడని ఆరోపించారు. అత్యవసర సరిస్థితుల్లో హాస్టల్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారని వాపోయారు. ఇలాంటి ప్రిన్సిపాల్ తమకు వద్దని చెప్పారు. కాగా విద్యార్థులకు స్థానిక నాయకులు అండగా నిలిచారు. జాతీయ రహదారిపై సుమారు గంటసేపు ధర్నా నిర్వహించారు. కాటారం ఎస్ఐ శ్రీనివాస్ సంఘటనా స్థలికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై ప్రిన్సిపాల్ చైతన్యను వివరణ కోరగా.. విద్యార్థులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తమకు అర్థం కావట్లేదని చెప్పారు. విద్యార్థులను బాగానే చూసుకుంటున్నామని, ప్రభుత్వ నిబంధన మేరకే పనిచేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి డీజే పెట్టాలని విద్యార్థులు కోరగా తిరస్కరించినట్టు చెప్పారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన ఎన్నోసార్లు దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్టు వివరించారు. విద్యార్థులను కావాలనే పలువురు పక్కదోవ పట్టించారని అన్నారు. అనంతరం ఎంపీపీ పంతకాని సమ్మయ్య జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు ఫోన్ ద్వారా సమస్యను విన్నవించారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.