Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దిశ ఎన్కౌంటర్ ఘటనపై దాఖలైన కేసులో పిటిషనర్ల వాదనలు ముగిశాయి. పోలీసుల వాదనల కోసం విచారణను కోర్టు ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ భాస్కర్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చటాన్‌పల్లి వద్ద ఓ వైద్యురాలు (దిశ) హత్యాచారానికి గురైన కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఘటనాస్థలికి వారిని తీసుకెళ్లినప్పుడు తమపై దాడికి ప్రయత్నించిన కారణంగా ఎన్కౌంటర్ చేశామంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కమిషన్ ఏర్పాటైంది. ఎన్‌కౌంటర్‌పై సందేహాలను వ్యక్తం చేస్తూ ఆ కమిషన్ రిపోర్టు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారాన్ని హైకోర్టు విచారించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పది మంది పోలీసులపై కేసు నమోదు చేయాలని వ్రిందా కోరారు. ఇనిస్టెంట్ జడ్జిమెంట్ పేరుతో పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నలుగురు అమాయకుల ప్రాణాలు తీశారనీ, దీనికి ఎన్కౌంటర్ అనే పేరు పెట్టారంటూ వాదించారు.
మెమో రద్దు కరెక్టే...
ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించిన నిందితులుగా బీఎల్ సంతోష్, ఇతరులను చేర్చుతూ సిట్ వేసిన మెమోను ఏసీబీ కోర్టు రద్దు చేయడాన్ని హైకోర్టు ఆమోదించింది. ఈ కారణంగా మెమోను సిట్ సవాల్ చేసిన కేసు నిష్పప్రయోజనమే అవుతుందని తెలిపింది. మెమోను ఏసీబీ కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ జస్టిస్ నాగార్జున సోమవారం తీర్పు వెలువరించారు. ఇదే కేసులో బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌కు సిట్ ఇటీవల ఇచ్చిన 41ఎ నోటీసుల అమలును నిలిపివేస్తూ గత స్టే ఉత్తర్వులను జస్టిస్ సురేందర్ సోమవారం పొడిగించారు.
గ్రామంలో సామాజిక బహిష్కరణపై రిట్...
గ్రామాభివృద్ధికి రూ.10 లక్షల నిధులు ఇవ్వకపోవడంతో సామాజిక బహిష్కరణ చేశారనే కేసులో అధికారులు సత్వరమే స్పందించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. ఆ జిల్లాలోని జాక్రాన్పల్లి మండలానికి చెందిన ఎ.శంకర్‌గౌడ్ మరో నలుగురి విషయంలో గ్రామ కమిటీ తీసుకున్న సామాజిక బహిష్కరణ నిర్ణయంపై దాఖలైన రిట్‌ను జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి సోమవారం విచారించారు. కల్లు గీతకు అధికారిక అనుమతులు పొందినా గ్రామ కమిటీ రూ.10 లక్షలు ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని, దీంతో తమకు గ్రామంలో ఎవరైనా, ఎలాంటి సహాయ సహకారాలు అందించినా వాళ్లకు జరిమానా విధిస్తామంటూ కమిటీ హుకూం జారీ చేసిందని పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వంతోపాటు కమిటీలోని తొమ్మిది మందికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
ప్రారంభమైన న్యాయ సేవాధికార సంస్థలు...
కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో న్యాయ సేవాధికార సంస్థలు సోమవారం ప్రారంభమయ్యాయి. హైకోర్టు నుంచి ఆన్లైన్ ద్వారా చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వాటిని ప్రారంభించారు. ఆ వెంటనే అవన్నీ విధుల్లోకి వచ్చాయి.