Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైరవీలతో ప్రయోజనముండదు
- ఉపాధ్యాయుల్లో నిరంతరం చైతన్యం పెంచాలి : టీఎస్‌యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణలో చుక్కా రామయ్య
- టీచర్ల ఖాళీలను భర్తీ చేయాలి : నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య చెప్పారు. పైరవీలతో ప్రయోజనముండబోదనీ, ఉపాధ్యాయులు ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి ఆ సంఘం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్, అధ్యాపకదర్శిని-39ని చుక్కా రామయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో బలమైన ఉపాధ్యాయ ఉద్యమం నిర్మితమైందనీ, ఆ ఉద్యమ స్పూర్తిని కొనసాగించటానికి ఈ డైరీ కరదీపికగా ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యకర్తల మధ్య ఉండటమే తనకు సంతోషమనీ, కార్యకర్తల మధ్యనే తుదిశ్వాస విడవాలనుకుంటున్నానని అన్నారు. అందుకే తనకు ఓపిక లేకపోయినా టీఎస్‌యూటీఎఫ్ నాయకులు పిలవకపోయినా ఈ కార్యక్రమానికి వచ్చానని వివరించారు. తుది వరకూ యూటీఎఫ్నకు విశ్వాసంతో ఉంటానన్నారు. ఉద్యమాలను నిర్మించడంలో రాజీపడొద్దని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలనీ, కార్మికుల హక్కుల కోసం అండగా ఉండాలని సూచించారు. పోరాటాలతోనే ఉపాధ్యాయులకు అనేక హక్కులొచ్చాయని గుర్తు చేశారు. వారిలో నిరంతరం సమస్యలపై పోరాడే చైతన్యాన్ని పెంపొందించాలని కోరారు. యూటీఎఫ్‌లో తనకున్న బంధాన్ని, అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ టీఎస్‌యూటీఎఫ్ డైరీలో పొందుపరచిన 90 పేజీల సమాచారం ఎంతో విజ్ఞానదాయకంగా ఉందన్నారు. ఉపాధ్యాయులకే కాకుండా పాత్రికేయులు, సాధారణ ప్రజలందరికీ ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో బదిలీలు, పదోన్నతులు, నియామకాల్లేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందన్నారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైనా కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల్లేక సిలబస్ కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం నూతన కొత్త ఏడాదిలోనైనా ఉపాధ్యాయుల ఖాళీల భర్తీపై దృష్టి సారించాలన్నారు. మన ఊరు-మన బడి, సమాంతర ఇంగ్లీషు మీడియం వంటి పథకాలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వ కాలేజీలను స్థాపించాలని సూచించారు.
13,14 తేదీల్లో టీఎస్‌యూటీఎఫ్
రాష్ట్ర మహాసభలు : చావ రవి
ఈనెల 13,14 తేదీల్లో రంగారెడ్డి జిల్లా సాగర్ రోడ్ మన్నెగూడలో బీఎంఆర్ సార్థా కన్వెన్షన్‌లో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఐదో మహాసభలు జరుగుతాయని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి చెప్పారు. ముఖ్యఅతిధిగా విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హాజరవుతారని అన్నారు. కేరళ మాజీ మంత్రి కెకె శైలజ టీచర్ ప్రారంభోపన్యాసం చేస్తారని వివరించారు. అతిధులుగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఆహ్వానసంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ హాజరవుతారని అన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శులు ఈ గాలయ్య, శారద, ఎమ్మెల్సీ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం వెంకటప్ప, శ్యామ్ సుందర్, గోపాల్ నాయక్, కల్పన, జగన్నాథ్, అశోక్, మస్తాన్ రావు, దత్తు, గణేష్, బాషా తదితరులు పాల్గొన్నారు.