Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు పేదల పక్షాన ఉండాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా
- కాకి మాధవరావు ఆత్మకథ సంపుటి ఆవిష్కరణ
నవతెలంగాణ-కల్చరల్
రాజ్యాంగంలోని ప్రాథమిక లక్షణాలైన లౌకిక, ప్రజాస్వామిక, సమైక్య, సంక్షేమానికి నేడు ముప్పు వాటిల్లిందని, అందువల్ల అప్రజాస్వామిక.. మతోన్మాద ప్రభుత్వాన్ని ఎదిరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా అన్నారు. మార్క్సిస్టులు అంబేద్క్కరిస్టులు ఐక్యంగా లాల్ నీల్ జెండాగా కలిసి ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కులం, వర్గం, పితృస్వామ్యం దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలని, వీటి నిర్ములనకు స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు రచించిన 'సంకెళ్లను తెంచుకొంటూ' ఆత్మకథ సంపుటి హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై సోమవారం లతా రాజా ఫౌండేషన్, ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హెల్ప్ డెస్క్ నిర్వహణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. కాకి మాధవరావు ఆత్మకథ కోట్లాది మంది జీవిత కథ లేనని అన్నారు. ఆయన జీవిత కథకు తన జీవిత కథకు సామ్యత ఉందన్నారు. విద్య వల్లనే ఎన్నో అవరోధాలను ఎదుర్కొనే శక్తి వచ్చిందని చెప్పారు. శంకరం వంటి అధికారి మాధవరావుకు స్ఫూర్తిప్రధాత అని వివరించారు.
మాధవరావును నాటి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని, నేడు సమస్యలపై ప్రశ్నిస్తే వారిని అర్బన్ నక్సలైట్, దేశ ద్రోహిగా ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ సర్వీసు అధికారులు వారి ఉనికి కోసం, వారి వారి అవసరాల కోసం కాకుండా పేదల పక్షాన పని చేస్తే దేశంలో ఎన్నో మార్పులు సాధ్యమని, మాధవరావు ఆత్మకథ ఇదే చెబుతుందని తెలిపారు.అధ్యక్షత వహించిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల పట్ల అంకిత భావం ఉన్న అధికారులు ఎలా పని చేయవచ్చన్న దానికి శంకరం మాధవరావు వంటి వారు ఉదాహరణ అన్నారు. రచయిత్రి వోల్గా, ప్రొఫెసర్ హరగోపాల్, సుజాతరావు, సతీష్ చందర్, విద్యా సాగర్ తదితరులు గ్రంథ సుమీక్ష చేశారు.