Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటింటికీ తాగు నీరు ఇస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలి
- ఈఎస్ఐ, పీఎఫ్, గుర్తింపు కార్డులివ్వాలి : సీఐటీయూ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించిన భగీరథ కార్మికులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
భగీరథ కార్మికులకు కనీస వేతనం, ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసి, కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను మిషన్ భగీరథ కార్మికులు ముట్టడించారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్మికులు.. పలు డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ.. కనీస వేతనం అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం వేతనం రూ. 24 వేల ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఇంటికీ నీరు ఇవ్వకపోతే ఓటు అడగనని హామీ ఇచ్చి రెండో సారి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. కానీ దాని కోసం కష్టపడ్డ కార్మికులకు మాత్రం అరకొర వేతనాలు ఇస్తూ కాంట్రాక్టర్ల ద్వారా ఇష్టానుసారంగా శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు వస్తున్న వేతనం అతి తక్కువ ఉండటం వల్ల వారి జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యలు వస్తే ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. నిర్ణీత పని గంటలు లేక రోజుకు 12 గంటలు పనిచేయాల్సి వస్తోందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పని ఒత్తిడిని తగ్గించడంతో పాటు వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్‌లో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం సీఐటీయూ బృందంతో కలిసి కార్మికులు అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు వినతి పత్రం అందజేసి, తమ సమస్యలను వివరించారు. సానుకులుంగా స్పందించిన ఆయన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జగదీశ్, ఏ.రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి దివ్య ప్రతాప్, యూనియన్ నాయకులు వెంకటేష్, రవి, యాదయ్య, వెంకటేష్, బాలరాజ్, కార్మికులు పాల్గొన్నారు.