Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటా బయటా స్త్రీలకు తప్పని తిప్పలు
- పితృస్వామిక భావజాలం మహిళను అణచివేస్తున్నది
- సావిత్రి బాయి ఫూలే చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి : సావిత్రిబాయి ఫూలే జయంతి సభలో జస్టిస్ రాధారాణి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నేటి ఆధునిక సమాజంలోనూ మహిళలపై వివక్ష కొనసాగుతున్నదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సావిత్రిబాయి ఫూలే 192వ జయంతి సందర్భంగా ఎస్వీకే కార్యదర్శి ఎస్ వినరుకుమార్ అధ్యక్షతన 'భారత దేశం-మహిళా సాధికారిత' అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ రాధారాణి మాట్లాడుతూ స్త్రీల ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు. మహిళ స్వతంత్ర శక్తిగా ఎదగటానికి చదువు ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. చదువు వల్ల ధైర్యం వస్తుందన్నారు. ఆర్థిక స్వాతంత్రం పెరుగుతుందని తెలిపారు. ఇది గమనించే..స్త్రీలకు చదువు అక్కరలేదని సమాజం భావిస్తున్నదన్నారు. పూర్తిగా ఇది పితృస్వామిక భావజాల రూపమేనని తెలిపారు. కనిపించని రూపంలో ఈ భావజాలం ప్రతి ఒక్కరిలోనూ ఉందన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే..సావిత్రి బాయి ఫూలే కాలంలో ఈ భావజాల ప్రభావం ఎలా ఉందో ఊహించుకోవచ్చన్నారు. మహిళలు చదువుకోకూడదు, అందునా..అంటరాని దళితులు విద్యనభ్యసించటం మహానేరంగా భావిస్తున్న రోజుల్లోనే..సావిత్రిబాయి ఫూలే పూనేలో 12 పాఠశాలలు ప్రారంభించి అంటరాని వారికి, మహిళలకు విద్యనందించిందని గుర్తుచేశారు. ఫూలే కృషి ఫలితమే..నేడు మనం ఈ మాత్రం స్వేచ్ఛను పొందుతున్నామని చెప్పారు. చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సామాజిక సేవా ధృక్పథం పెరగటమే కాక, మానవ విలువలు పెంపొందుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే డిగ్రీలు పొందటంతోనే సరిపోదనీ, సమాజాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. లింగ సమానత్వాన్ని సాధించాలంటే స్త్రీ, పురుషుల ఆలోచనల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. వెనకబడ్డ ఆలోచనలతో అమ్మాయిలు ఆ బట్టలెందుకేసుకున్నారు? అర్థరాత్రి బయటకెందుకొచ్చారు? ప్రశ్నిస్తున్నారని గుర్తుచేశారు. ఇలాంటి వ్యాఖ్యానాలు సమాజ పురోగమనానికి ఉపయోగపడవన్నారు. చిన్నపిల్లలనుంచి పండు ముసలోల్లపై కూడా లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు చూస్తున్నామని గుర్తుచేశారు. ఒక్క తెలంగాణలోనే ఏడాదికి రెండు వేల లైంగిక దాడులు జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చాన్నారు. నిర్భయ చట్టాలొచ్చినా.. ఎందరు పోలీసులను పెట్టినా..భావజాలంలో మార్పురాకుండా ఇవి ఆగవన్నారు. స్త్రీని రెండోతరగతి పౌరురాలుగా చూసినంతకాలం ఈ అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. మతం ముసుగు మనిషిలోని ప్రశ్నను చంపేస్తుందన్నారు.ఆలోచనను అణచేస్తుందన్నారు. వెనక్కి లాగేవారున్నంత కాలం సమాజం ముందుకు పోదన్నారు. సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తేనే..దేశ జీడీపీ పెరుగుతుందని తెలిపారు. తప్పుడు భావాలు, ఆచారాల పేరుతో సాగుతున్న దుష్ప్రభావాలను అర్థం చేసుకోవటమంటే సావిత్రి భాయి చూపిన చదువు ఒక్కటే మార్గమని నొక్కి చెప్పారు.
డాక్టర్ బీఆర్అంబేద్కర్ లా కళాశాల ప్రిన్స్‌పల్ డాక్టర్ డి సృజన మాట్లాడుతూ సావిత్రిబాయిఫూలే ఆనాడు పడ్డ సంఘర్షణను అర్థం చేసుకోవటం అంతసులువైన విషయం కాదన్నారు. సామాజికంగా అణగదొక్కబడుతున్న వారికే విద్యనందించాలని భావించటం గొప్ప విషయమన్నారు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. నేటి సమాజంలో చాలా చోట్ల బాగా చదువుకున్న కుటుంబాల్లో సైతం ఆడపిల్లలను విద్యకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భౌతిక దాడులు, అవమానాలు ఎన్నెదురైనా తన లక్ష్యం మరవకుండా చివరి వరకు తన కృషి కొనసాగించిందని చెప్పారు.
ఎస్ వినరుకుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలేకు అనేక ప్రత్యేకతలున్నాయని చెప్పారు. మొట్టమొదటి సారిగా బాలికలకు పాఠశాల ఏర్పాటు చేయటమేకాక, అతిశూద్రులకు, మహిళలకు చదువు నేర్పించే కార్యక్రమానికి పూనుకున్నదని చెప్పారు. ఆ రకంగా అనేక పాఠశాలలు నెలకొల్పిందన్నారు. దళితులు, మహిళలను చదువు దూరంగా ఉంచాలని మనుస్మృతి చెబుతుందని గుర్తుచేశారు. దీనికి భిన్నంగా సావిత్రి బాయిఫూలే చదువుల తల్లిగా మారిందని చెప్పారు. వితంతువులను, గర్భందాల్చిన మహిళలకు ఆశ్రమాలను ఏర్పాటు చేసిందన్నారు. చివరకు ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవచేస్తూనే చనిపోయిందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు, ఎస్వీకే బాధ్యులు జి బుచ్చిరెడ్డి, ఎన్ సోమయ్య, సుజావతి తదితరులు పాల్గొన్నారు.