Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు ఏకం కావాలి
- నోట్ల రద్దుపై శ్వేతపత్రం విడుదల చేయాలి : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. కేంద్రంలో మోడీ సర్కారును గద్దె దింపేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఏకం అయ్యి, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆకాంక్షించారు. దీనికోసం సీపీఐ తనవంతుగా ఇతర పార్టీలతో చర్చించి, ఉమ్మడి వ్యూహరచనకు కృషి చేస్తామన్నారు. సోమవారం మగ్దూం భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లౌకిక, ప్రజాతంత్ర పార్టీల మధ్య చీలికలు బీజేపీకి అనుకూలంగా మారకూడదని చెప్పారు. మోడీ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం మళ్ళీ కొనసాగితే దేశ వినాశనం తప్పదని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికలకంటే ముందు తెలంగాణ, తమిళనాడు, త్రిపుర తదితర రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోడీ పాలనలో దేశంలో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరిందనీ, నిరుద్యోగ రేటు 18 నెలల్లో అత్యధికంగా 8.5 శాతానికి పైగా నమోదైందన్నారు. ద్రవ్యోల్బణం పెరిగి, వ్యవసాయం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయని చెప్పారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా నిత్యవసర వస్తువుల ధరలు సహా అన్నీ పెరిగాయనీ, పేదలు నిరుపేదలుగా మారితే, అదానీ, అంబానీ వంటి కొందరు కార్పొరేట్ల సంపద మరింత పెరిగిందని చెప్పారు. పార్లమెంటు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై జాతీయ లా కమిషన్ రాజకీయపార్టీల అభిప్రాయాలు కోరుతూ లేఖ రాసిందని తెలిపారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనేది బీజేపీ విధానమనీ, బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ కలిగిన భారతదేశంలో ఇది అసాధ్యమనీ, ఆచరణయోగ్యం కాదని స్పష్టం చేశారు. స్థిరమైన ప్రభుత్వమా...జవాబుదారీ ప్రభుత్వమా అనే చర్చ జరిగినప్పుడు తాను జవాబుదారీ ప్రభుత్వాన్నే కోరుకుంటానని భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు. భారత ఎన్నికల విధానంలో సమూల మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. ఎలక్టోరల్ బాండ్స్‌తో బీజేపీ కార్పొరేట్ సంస్థల నుండి భారీగా నగదు పోగుచేసుకొని, ప్రతిపక్షపార్టీలను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. సమగ్ర ఎన్నికల సంస్కరణలు, దామాషా ప్రాతినిధ్య ఎన్నికల విధానం అవసరమని చెప్పారు. వలస కూలీలు ఎక్కడి నుంచైనా ఓటు వేసే అంశాన్ని ఎన్నికలు కమిషన్ ఇప్పుడు తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నోట్లరద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చింది ఏకగ్రీవ తీర్పు కాదన్నారు. నోట్లరద్దుపై కేంద్ర శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో గవర్నర్ల పాత్రను తప్పుపట్టారు. దీనిపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, ఎన్.బాలమల్లేశ్, కలవేన శంకర్, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, బాలనర్సింహా, వి.ఎస్.బోస్, ఇ.టి.నర్సింహా పాల్గొన్నారు. అంతకుముందు సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్ ఏడవ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు.