Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచుల ధర్నా భగ్నం
- ఎక్కడిక్కడ కాంగ్రెస్ నేతల గృహనిర్భందం. అరెస్టులు
- ప్రగతిభవన్‌వైపు దూసుకెళ్లిన కాంగ్రెస్ నేతలు
- సీఎం దిష్టిబొమ్మల దహనం
- నిధులు, విధులపై సర్కారు నిర్లక్ష్యం: రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సర్పంచులకు విధులు, నిధులవ్వాలంటూ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ తలపెట్టిన ధర్నాను సర్కారు భగం చేసింది. ఎక్కడిక్కడ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టులు చేసింది. అనేక మందిని గృహ నిర్భందం చేసింది. శనివారం పొద్దునే బంజారాహిల్స్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇందిరాపార్కు ధర్నాకు వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, రేవంత్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బలవంతంగా అరెస్టు చేసి బొల్లారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఆయన్ను విడుదల చేశారు. షబ్బీర్ అలీ, మహేష్‌కుమార్‌గౌడ్, మల్లురవి, నాగేష్‌ముదిరాజ్, రోహిన్‌రెడ్డి, సునీతారావు తదితరులను గృహ నిర్భందం చేశారు. అరెస్టులకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. గాంధీభవన్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చరణ్‌కౌశిక్, రవళిరెడ్డి, సుధీర్‌రెడ్డి, నిజాముద్దీన్, రియాజ్ తదితరులు ప్రగతిభవన్ వైపు దూసుకెళ్లారు. వారిని అరెస్టు చేసి బేగంబజార్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ విధానాలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సీతక్క, చల్లా వంశీచంద్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు తీవ్రంగా ఖండించారు.
పంచాయతీల డబ్బు రూ 35వేల కోట్లు కొల్లగొట్టిన గజదొంగ
సీఎం కేసీఆర్‌పై రేవంత్ ఆగ్రహం
గ్రామపంచాయితీలకు వివిధ బకాయిల కింద ఇవ్వాల్సిన దాదాపు రూ. 35వేల కోట్లను కొల్లగొట్టిన గజదొంగ సీఎం కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆయన్ను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయితీలకు నేరుగా నిధులిచ్చి వాటిపై సర్పంచులకు సర్వాధికారాలను కట్టబెట్టారని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ ఆ స్ఫూర్తి మరిచి పంచాయితీరాజ్ సంస్థలను నాశనం చేస్తున్నారని విమర్శించారు. నెలనెలా పంచాయతీలకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల నిధులను ఇవ్వకుండా మరోవైపు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఇవ్వటం లేదన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు చేరకుండా ఈ ప్రభుత్వం కొల్లగొట్టిందని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం చేశారంటూ విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి...ఆయనపై విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.
గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. తండాలోని పంచాయతీలకు పక్కా భవనాలు కట్టించరా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతివనం తదితర పనులను సర్పంచులు సొంత నిధులతో చేపట్టారని గుర్తు చేశారు. సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఆనంద్‌రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారనీ, మునుగోడులో సర్పంచ్ బస్టాండ్‌లో బిచ్చమెత్తారనీ, సూర్యాపేట జిల్లాలో శాంతమ్మ అనే మహిళా సర్పంచి తాళిబొట్టు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ డబ్బులను మెగా కృష్ణారెడ్డి, ప్రతిమ శ్రీనివాస్ వంటి బడా కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించారని ఆరోపించారు. పోలీసులు బీఆర్ఎస్ సర్కారుకు కీలబొమ్మలుగా మారిపోయారనీ, డీజీపీ అంజనీకుమార్ మమ్ముల్ని అరెస్టు చేసి ప్రభుత్వానికి నజరానా ఇవ్వాలనుకున్నారని విమర్శించారు.
అయ్యప్ప విమర్శల వెనుక బీజేపీ, బీఆర్ఎస్
అయ్యప్ప స్వామిపై వస్తున్న విమర్శల వెనుక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కుట్ర దాగి ఉందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. డిసెంబర్ 19న కొడంగల్ నియోజకవర్గంలో మాట్లాడితే ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ప్రశాంత్ కిషోర్ కుట్ర పన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలని కేంద్రానికి కోరితే ఇప్పటివరకు స్పందన లేదన్నారు.