Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ ఐపాస్, ఐటీ అనుబంధ రంగాల్లో...
- ప్రయివేటు రంగంలో 22.50 లక్షల ఉద్యోగాల కల్పన
- అన్ని రంగాల పెట్టుబడులతో నివేదిక రూపొందించాలి
- అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో తమ ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించిందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. విప్లవాత్మక విధానాలు, పారదర్శక పాలన, టీఎస్ ఐపాస్‌తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చినట్టు ప్రకటించారు. ఎనిమిదేండ్లుగా వచ్చిన పెట్టుబడులతో పాటు భవిష్యత్‌లో రానున్నవాటిపైనా పరిశ్రమలు-ఐటీ శాఖ అధికారులతో సోమవారం హైదరాబాద్‌లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. టీఎస్ఐపాస్, ఐటీ - ఐటీ అనుబంధ రంగాల్లో 2014 నుంచి గతేడాది నవంబర్ వరకు దాదాపు 3 లక్షల 30 వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు మంత్రి తెలిపారు. మైనింగ్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగంతో పాటు ఇతర రంగాల్లో వచ్చిన పెట్టుబడులన్నింటినీ కలిపితే ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. త్వరలోనే ఆయా రంగాల్లోకి వచ్చిన పెట్టుబడుల వివరాలను కూడా విడుదల చేస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ మేరకు వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని ఇప్పటిదాకా వచ్చిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పెట్టుబడులతో ప్రయివేటు రంగంలో ఇరవై రెండున్నర లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించిందన్నారు. కేవలం ఒకటి రెండు రంగాలనే కాకుండా దాదాపు 14 రంగాలను ప్రాధాన్యతా రంగాలుగా తమ ప్రభుత్వం గుర్తించి పక్కా ప్రణాళికను రూపొందించి భారీ పెట్టుబడులను సాధించిందని కేటీఆర్ తెలిపారు. ఒక్కో రంగానికి ప్రత్యేకంగా అధికారిని నియమించడంతో పాటు ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్న కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరిపి, ప్రభుత్వ విధానాలు, ఇక్కడి మౌలిక వసతుల గురించి వివరించడంతోనే ఇది సాధ్యమైందన్నారు. భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో విజయం సాధించిన పరిశ్రమలు-ఐటీ శాఖలోని ప్రతి ఒక్క అధికారినీ, వారి బందాలనూ అభినందించారు. పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రభుత్వ విధానాలను రూపొందించడంతో పాటు అవసరమైన పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనను తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావించిందన్నారు. ఫలితంగానే భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని తెలిపారు. ఈ పెట్టుబడులతో లక్షలాది మందికి ఉపాధి లభించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎన్నో ఏండ్లుగా అగ్రస్థానంలో ఉన్న దేశంలోని ఇతర నగరాలను హైదరాబాద్ దాటిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆ దిశగా ముందుకెళ్లాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రానున్న సంవత్సర కాలానికి చేపట్టనున్న వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు తదితర అంశాల పైన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎమ్డీ వెంకట నరసింహారెడ్డి, వివిధ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.