Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోదావరి, కావేరి నదుల అనుసంధానానికి వ్యతిరేకం కాదు
- పోలవరం బ్యాక్‌వాటర్‌పై సర్వే చేయాలి : స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్
- గోదావరిపై శాస్త్రీయ అధ్యయనం చేయాలి : ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి
- వాడివేడిగా జీఆర్ఎంబీ భేటీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) చైర్మెన్ ఎంకే సింగ్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని జలసౌధలో జీఆర్ఎంబీ సమావేశం మంగళవారం వాడీవేడీగా జరిగింది. ఆయా అంశాలపై తెలంగాణ, ఏపీ అధికారులు తమ తమ వాదనలు గట్టిగా వినిపించారు. భేటికి తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, తెలంగాణ ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. గోదావరి నదిపై గూడెం, మొండికుంట ప్రాజెక్టుల డీపీఆర్‌లు, సీడ్ మనీ, టెలీమెట్రిల ఏర్పాటు, బోర్డు ఉద్యోగులు తదితర అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం సాగునీటి శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ బోర్డు మీటింగ్‌లో పలు అంశాలపై చర్చ జరిగిందన్నారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు స్టడీ చేస్తారనీ, ఆంధ్రప్రదేశ్‌తో ఇంటర్ స్టేట్ జల వివాదాలున్నాయనీ, వాటిని సీడబ్ల్యూసీ పరిశీలిస్తున్నదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ అంగీకరించదనీ, సహజంగానే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నదన్నారు. మొండికుంట వాగు, గూడెం ప్రాజెక్టుల డీపీఆర్‌లు చర్చ జరిగిందనీ, సాంకేతిక అనుమతుల విషయంలో ఏపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నదన్నారు. అయితే, ఇవాళ్టి మీటింగ్‌లో క్లియరెన్స్ వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. గోదావరిలో తెలంగాణకు 900 టీఎంసీల వాటా ఉందంటూ ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారనీ, గోదావరిలో నీటి లభ్యత ఎక్కువని, మూడు వేల టీఎంసీల మేర అధికంగా నీరు ఉందని తెలిపారు. ప్రాజెక్టుల ఖర్చు పెరుగుతున్నదనీ, తొందరగా అనుమతులు ఇస్తే పనులు పూర్తి చేస్తామన్నారు. గోదావరి విషయంలో టెలీమెట్రిక్ విధానాన్ని ఏర్పాటుచేస్తామని చెబుతున్నారనీ, ఆ విషయంలో తమకు అభ్యంతరం లేదన్నారు. కృష్ణాలో శ్రీశైలం నుంచి దొడ్డిదారిన ఏపీ నీటిని తరలిస్తున్నదనీ, అక్కడ కూడా టెలీమెట్రీలు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒక్క బ్యాక్ వాటర్ సమస్య మాత్రమే కాదనీ, అక్కడ ఏపీ కొత్త ప్రాజెక్టులను నిర్మించాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దానిపై బోర్డు దృష్టి పెట్టాలనీ, ఉన్న పథకాలకు ఇబ్బంది లేకుండా క్లియరెన్స్ ఇస్తే తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. పోలవరం బ్యాక్ వాటర్‌పై సర్వే చేయాలని మరోసారి కోరనున్నట్టు తెలిపారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానానికి తాము వ్యతిరేకం కాదనీ, ఏ రాష్ట్రానికి ఎంత నీరు అవసరం? ఏ రాష్ట్రంలో నీరెంత అందుబాటులో ఉంది? తదితర విషయాలపై సమగ్రంగా అధ్యయనం జరగాలని కోరారు.
'గోదావరిపై శాస్త్రీయ అధ్యయనం అవసరం'
ఏఈ ఈఎన్సీ నారాయణరెడ్డి సైతం మాట్లాడుతూ గోదావరిపై శాస్త్రీయ అధ్యయనం సీబ్ల్యూసీతో చేయించాలని నిర్ణయం జరిగినట్టు చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులపై మాకు అభ్యంతరాలు ఉన్నాయని వివరించారు. ఉరి వేసే ముందు ఖైదీకి కూడా చివరి అవకాశం ఇస్తారని గుర్తు చేశారు. నీటి లభ్యత ఉండగా, గూడెం ప్రాజెక్టులో అదనపు ఎత్తిపోతల ఎందుకని ప్రశ్నించారు. పోలవరంపై చర్చించేందుకు గోదావరి బోర్డు సరైన వేదిక కాదని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలపై ఇప్పటికే చర్చించామనీ, ఇప్పటికే ఆ సమస్యలు పరిష్కారమైనట్టు తెలిపారు.
'త్వరగా ఆధునీకరించాలి'
తెలంగాణ ఈఎన్సీ మురళధర్ మాట్లాడుతూ పెద్దవాగు ప్రాజెక్టు త్వరగా ఆధునీకరించాలని కోరినట్టు చెప్పారు. మొదటి ప్రాధాన్యంలో ఐదు అంతర్రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని చెప్పారు.
గతం...
కడెం-గూడెం ప్రాజెక్టుపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. కడెం ప్రాజెక్టుకు అవసరమైన నీటి లభ్యత ఉందనీ, గూడెం ఎత్తిపోతల పథకం నిర్మించాల్సిన అవసరం లేదంటూ గత ఆగస్టులో బోర్డుకు ఏపీ లేఖ రాసింది. అయితే కడెం ప్రాజెక్టులో పూడిక చేరడంతో మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందనీ, దీంతో ప్రత్యామ్నాయ ప్రాజెక్టును చేపట్టినట్టు తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. మరో వైపు గోదావరిలో నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడం, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను ఇప్పటి వరకు నిర్ణయించకపోవడంతో రెండు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతి జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గోదావరిలో 75శాతం డిపెండబిలిటీ ఆధారంగా 3216 టీఎంసీల జలాల లభ్యత ఉందని, ఏపీకి 1360 టీఎంసీల లభ్యత ఉందని వ్యాప్కోస్ అనే సంస్థ అధ్యయనంలో తేలిందని ఏపీ అంటుండగా, తెలంగాణకు 1480 టీఎంసీల లభ్యత ఉందని, ఏపీకి 1486.55 టీఎంసీల లభ్యత ఉందని తెలంగాణ చెబుతున్నది. ఈ క్రమంలో గోదావరిలో వాస్తవ నీటి లభ్యతపై జాతీయ సంస్థతో అధ్యయనం చేయించాలని గతంలో బోర్డు ప్రతిపాదించింది.