Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలలు గడుస్తున్నా పత్తి ధరలో కనిపించని మార్పు
- ప్రయివేటు కంటే తక్కువగానే నిర్ణయించిన సీసీఐ
- ఇండ్లల్లోనే పత్తి నిల్వలు
- కాలయాపనతో అన్నదాతల్లో ఆందోళన
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
పత్తి పంట దిగుబడితోపాటు ధర సైతం అమాంతం పడిపోయింది. మొదట్లో కొంత ఆశాజనకంగా ఉన్న పత్తి ధర... ఆ తర్వాత ఊగిసలాడుతున్నది. కొద్దిరోజుల తర్వాతైనా ధర పెరగకపోతుందా అని రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ నెలలు గడుస్తున్నా ధరలో ఏమాత్రం పెరుగుదల లేకపోవడంతో రైతుల ఇండ్లల్లోనే పత్తి నిల్వలు పేరుకుపోయాయి. పత్తి పైరు చివరి దశకు వచ్చినా ధర పెరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటాళ్ల కొద్దీ పత్తిని ఇంట్లో నిల్వ చేసుకొని ఇబ్బందులు పడుతున్నారు. ప్రయివేటులో ధర లేకపోవడం.. సీసీఐ వాణిజ్య కొనుగోళ్ల రంగంలోకి దిగినా ఎలాంటి ప్రయోజనమూ కనిపించడం లేదు. ప్రయివేటు ధర కంటే తక్కువగానే నిర్ణయిస్తున్న సీసీఐ వ్యవహారంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయివేటు వ్యాపారులు, సీసీఐ అధికారులు కుమ్మక్కు కావడంతోనే ధరలో ఎలాంటి మార్పులూ ఉండటం లేదని రైతు సంఘాల నేతలు, రైతులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట పత్తి. దీనికి మార్కెట్లో మంచి ధర వస్తేనే రైతులకు ప్రయోజనం. కానీ ఈ ఏడాది అన్నదాతలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయి దిగాలుగా ఉన్న అన్నదాతలకు పండిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో ఆశించిన ధర లేకపోవడంతో పంటను ఇండ్లల్లోనే నిల్వ చేసుకున్నారు. ఈ ఏడాది దిగుబడులు 50శాతానికి పడిపోవడంతో పండిన ఆ కాస్త పంటనైనా గిట్టుబాటు ధరకు విక్రయించాలని అన్నదాతలు ఆశ పడుతున్నారు. కానీ ప్రభుత్వ మద్దతు ధర రూ.6,380 ఉండగా.. మార్కెట్లో ప్రయివేటుగా ప్రస్తుతం రూ.8,080 వరకు ఉంది. సీసీఐ ధర మంగళవారం నాటికి రూ.7,900గా నిర్ణయించారు. సీసీఐ కన్నా ప్రయివేటులోనే రూ.100 ఎక్కువగా ఉంది. ప్రయివేటులో తొలుత రూ.9,010 వరకు పలికిన ధర క్రమంగా దిగజారుతూ రూ.7,300కు పడిపోయింది. తాజాగా రోజు కొంచెం చొప్పున పెరుగుతూ ప్రస్తుతం రూ.8,080కి చేరింది. ఈ ధరకు ఏ మాత్రం గిట్టుబాటుకాని రైతులు పత్తిని విక్రయించేందుకు వెనుకాడుతున్నారు.
సీసీఐ ఉన్నా కనిపించని ప్రయోజనం..!
సీసీఐ (భారత పత్తి సంస్థ) వాణిజ్య పరంగా కొనుగోళ్లు చేపడితే రైతులకు లాభం జరుగుతుందని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే సదరు ప్రభుత్వ రంగ సంస్థ పక్షం రోజుల కిందట వాణిజ్య కొనుగోళ్లను ప్రారంభించింది. కానీ ప్రయివేటు కంటే తక్కువగా ధర నిర్ణయించడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. ఇప్పటి వరకు సీసీఐ కనీసం కిలో పత్తి కూడా కొనలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. నామమాత్రంగానే రంగంలో ఉన్నామనే భ్రమలు కల్పిస్తోంది. ప్రయివేటు వ్యాపారస్తులు, సీసీఐ అధికారులు కుమ్మక్కు కావడంతోనే ధర పెంచడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పక్కనున్న మహారాష్ట్రలో సీసీఐ క్వింటాల్‌కు రూ.8300 వరకు చెల్లిస్తున్నట్టు తెలిసింది.
తెలంగాణలో మాత్రం ఆ ధరకు కొనుగోలు చేసేందుకు సిద్ధపడటం లేదని సమాచారం. తెలంగాణలో పన్నులు అధికంగా ఉండటంతోనే ధర అధికంగా చెల్లించడం లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి ధర నిర్ణయిస్తున్న సీసీఐ రైతుల పరిస్థితిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిందటేడాది ఈ సమయం వరకు మార్కెట్లో 5లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరగ్గా.. ఈ ఏడాది మాత్రం 2లక్షల క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రైతుల ఇండ్లలోనే అధికంగా నిల్వ ఉంది. కిందటేడాది క్వింటాల్‌కు రూ.10వేలకు పైగా ధర పలకడంతో ఈ ఏడాది కూడా అదే స్థాయికి వస్తుందని అన్నదాతలు గంపెడాశలు పెట్టుకున్నారు. అధికారులు, ప్రయివేటు వ్యాపారులు ఆ దిశగా ఆలోచన చేస్తే అన్నదాతలకు ప్రయోజనం చేకూరుతుంది.