Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో వైద్య విద్య దేశానికే ఆదర్శం
- డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దేవుడిచ్చిన వరం
- నల్లగొండ ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల శాతం పెరగాలి
- శిశువుకు తల్లిపాలే అమృతం : ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ-చౌటుప్పల్/ మర్రిగూడ
తెలంగాణ రాష్ట్రం డయాలసిస్ సేవలో దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని మంగళవారం విద్యుత్తుశాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వాస్పత్రిని ప్రారంభించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రం వైద్య, విద్యలో దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలోనూ డయాలసిస్ సెంటర్ ఏర్పాటుచేసి పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న చికిత్సను పరిశీలించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఆ రాష్ట్రంలోనూ ఇదే తరహా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాకముందు మన రాష్ట్రంలో మూడు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వాటిని 102కు పెంచి ఉచిత డయాలసిస్ సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఏడాదికి వంద కోట్ల రూపాయలు డయాలసిస్ కేంద్రాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చొరవతో చౌటుప్పల్ ప్రభుత్వా స్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. మునుగోడులో కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాల కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన పిల్లలు వైద్య విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ కళాశాలలను త్వరలో ప్రారంభిం చుకోబోతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. అప్పుడే పుట్టిన శిశువుకి మొదటిగంటలో వచ్చే తల్లిపాలే అమృతమని చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పు ఆపరేషన్ల శాతం తగ్గాలని, నార్మల్ డెలివరీకే వైద్యులు మొగ్గు చూపాలని సూచించారు. ఆపరేషన్ల వల్ల తల్లి, పిల్లలకి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయన్నారు. దానిపట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యులను కోరారు. ఇతర జిల్లాలతో పోలిస్తే నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీ శాతం తక్కువగా ఉన్నదని దానిని మెరుగు పర్చుకోవాలని అధికారులకు సూచించారు. కొత్తగా 41 మంది డాక్టర్స్‌ను ఒక్క నల్లగొండ జిల్లాకే అత్యధికంగా రిక్రూట్మెంట్ చేసినట్టు చెప్పారు. వారం రోజుల్లోనే శివన్నగూడ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు ఇండ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం వైపు ప్రస్తుతం భారతదేశం మొత్తం చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, వైద్యవిధాన పరిషత కమిషనర్ డాక్టర్ అజరుమిశ్రా, కలెక్టర్లు పమేలా సత్పతి, వినరుకృష్ణారెడ్డి, యాదాద్రి అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఎంహెచ్ఓ కొండల్రావు, నల్లగొండ జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి, ఎస్సీ కమిషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆస్పత్రుల సూపరింటెండెంట్స్ డాక్టర్ అలివేలు, డాక్టర్ రాజేష్, ఆరోగ్య మిత్ర రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.